మింగుడు పడని బొండాలు! | - | Sakshi
Sakshi News home page

మింగుడు పడని బొండాలు!

Apr 23 2026 8:00 AM | Updated on Apr 23 2026 8:00 AM

సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టాలో రబీ వరి రైతుల ఆశల రకం బొండాలు (ఎంటీయూ–3626) కొనుగోలుపై ఈ ఏడాది స్పష్టత లేకుండా పోయింది. ఈ రకాన్ని కొనుగోలు చేస్తామని మిల్లర్లు చెబుతున్నా మొత్తం పంటలో మూడోవంతు మాత్రమే కొనుగోలు చేయాలని వారు నిర్ణయించుకోవడం రైతులకు మింగుడు పడని అంశంగా మారింది.

అనుమతి లేకున్నా సాగు సాధారణమే..

ఏటా బొండాల రకం సాగుకు అనుమతి లేదని ప్రభుత్వం చెప్పడం... రైతులు సాగు చేయడం.. ఆ తర్వాత ప్రభుత్వం మిల్లర్లతో కొనుగోలు చేయించడం సర్వ సాధారణంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ రకం సాగుకు అనుమతి ఇచ్చేది లేదని ప్రభుత్వం చెప్పడం, రైతులు పెద్ద ఎత్తున సాగు చేయడం విదితమే. జిల్లా వ్యాప్తంగా 1,29,913 లక్షల ఎకరాలలో రబీ సాగు జరిగిన విషయం తెలిసిందే. దీనిలో సుమారు 37,050.14 ఎకరాలకు పైగా బొండాల రకం సాగు చేశారు. తూర్పు డెల్టాలో 55 బస్తాలు (75 కేజీలు) చొప్పున, మధ్య డెల్టాలో 50 బస్తాల చొప్పున దిగుబడిగా రానుంది. మొత్తం మీద జిల్లాలో 1,47,273 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడిగా రానుంది. తూర్పు డెల్టా పరిధిలోని ఆలమూరు, కె.గంగవరం, రామచంద్రపురం మండలాల్లో ఈ సాగు అధికంగా జరిగింది. ఒక్క కె.గంగవరం మండలంలోని 16,287 ఎకరాల ఆయకట్టులో వరి సాగు జరగగా దీనిలో 15,322.8 ఎకరాల్లో బొండాల రకం సాగు చేశారు. ఇక్కడ ఎకరాకు 55 బస్తాలు (బస్తా 75 కేజీ)ల చొప్పున ఈ మండలంలోని సుమారు 63 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా దిగుబడి వస్తోంది. రామచంద్రపురం మండలంలో మొత్తం ఆయకట్టు 18,953 ఎకరాలు కాగా, ఇక్కడ 18,078 ఎకరాలలో బొండాల సాగు అయింది. ఈ మండలంలోనే 74,571 మెట్రిక్‌ టన్నుల దిగుబడి రానుంది. ఇక ఆలమూరు మండలంలో మొత్తం ఆయకట్టు 9,855 ఎకరాలు కాగా దీనిలో సుమారు 1,497 ఎకరాల్లో బొండాల రకం సాగు చేశారు. ఇక్కడ 6,175 మెట్రిక్‌ టన్నులు దిగుబడిగా వస్తుందని అంచనా.

కొనుగోలు సగం కన్నా తక్కువే..

జిల్లాలో పండే అన్నిరకాల ధాన్యం 4.80 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా దీనిలో 2.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనిలో బొండాల రకం కొనుగోలు 67,700 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కావడం గమనార్హం. బొండాలలో సగం మాత్రమే కొనుగోలు చేయనున్నారు. మిగిలిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. అయితే దీనిపై పౌరసరఫరాల శాఖ అధికారుల స్పందన మరో విధంగా ఉంది. ‘ధాన్యం కొనుగోలుకు లక్ష్యం అంటూ ఏదీ లేదని, ఇప్పుడు అనుకున్న పరిమాణానికి మించి కొనుగోలు చేయాల్సి వస్తే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటామని’ జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం శ్రీనివాస్‌ ‘సాక్షి‘కి తెలిపారు. రైతుల అవసరాలకు సుమారు 20 వేల మెట్రిక్‌ టన్నులు పోను ఇంకా సుమారు 60,273 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

నమ్మకం కోల్పోయిన రైతులు

కేరళలో బొండాలకు ఇప్పుడు మంచి డిమాండ్‌ ఉంది. ఈ కారణంగా మిగిలిన ధాన్యాన్ని కూడా మిల్లర్లే కొనుగోలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే జిల్లాలో భాగంగా ఉన్న మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరిలో కలపడంతో మిల్లులకు కొరత ఏర్పడింది. ఇప్పుడు జిల్లాలో కేవలం 18 మాత్రమే బ్రాయిలర్‌ మిల్లులున్నాయి. వీరు మాత్రమే బొండాల రకం కొనుగోలు చేయాల్సి ఉంది. దీని వల్ల మిలిగిలిన బొండాలు కొనుగోలు సాఫీగా సాగుతుందనే నమ్మకం రైతులకు కలగడం లేదు. అష్టకష్టాలు పడి పంట పండించామని, ఈ సమయంలో కొనుగోలు చేయకపోతే నష్టపోతామని రైతులు ఆందోళనతో ఉన్నారు.

బొండాల రకం కొనుగోలుపై

అన్నదాతల్లో ఆందోళన

రబీలో వాటి సాగే అధికం

1.29 లక్షల ఎకరాల్లో వరి సాగు

37,050 ఎకరాల్లో బొండాల రకం

దిగుబడి అంచనా

1.47 లక్షల మెట్రిక్‌ టన్నులు

ఈ ఏడాది కొనుగోలు చేయాలనుకొన్నది 67 వేల మెట్రిక్‌ టన్నులు

తక్కువ కొనుగోలు చేస్తే

నష్టపోతామంటున్న రైతులు

అందుబాటులో ఉన్న బాయిలర్‌ మిల్లులు 18 మాత్రమే

Advertisement
 
Advertisement
Advertisement