మహిళల ఆందోళనతో పరీక్షల వాయిదా | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆందోళనతో పరీక్షల వాయిదా

Apr 23 2026 8:00 AM | Updated on Apr 23 2026 8:00 AM

అమలాపురం టౌన్‌: అమలాపురంలోని ఏలీమ్‌ ఐటీఐలో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమెషీన్‌ శిక్షణ కేంద్రంలో చోటు చేసుకున్న వివాదంతో బుధవారం జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. శిక్షణ కేంద్రంలో అసౌకర్యాలపై తాము ప్రశ్నిస్తే బీసీ కార్పొరేషన్‌కు చెందిన కొందరు అధికారులు, సిబ్బంది తమకు హాజరు లేకుండా చేసి అనర్హులను చేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమపై కార్పొరేషన్‌కు చెందిన ఓ అఽధికారి కక్ష కట్టి, టార్గెట్‌ చేసి ఆన్‌లైన్‌ పరీక్ష నుంచి తొలగించారని పదిమంది మహిళలు స్థానిక విలేకర్లకు తెలిపారు. తమకు హాజరు సరిపోలేదని సాకుగా చూపి పరీక్షకు హాజరు కాకుండా చేయడానికి అధికారులు యత్నిస్తున్నారని ఇటీవల మునిపల్‌ కమిషనర్‌ నిర్మల్‌కుమార్‌కు బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. బాధిత మహిళల ఆందోళనతో బీసీ కార్పొరేషన్‌ కో ఆర్డినేటర్‌ శ్రీనుబాబు పరీక్షలను వాయిదా వేశారు.

దళారులు లేకుండా ధాన్యం

విక్రయించుకునే ఏర్పాట్లు

ఆలమూరు : దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా తమ ధాన్యాన్ని విక్రయించుకునేలా ఏర్పాట్లు చేశామని జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్‌ అన్నారు. బుధవారం మండల పరిధిలోని మోడేకుర్రు, నర్సిపూడి గ్రామాలలో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సత్య కృష్ణ రైస్‌ మిల్లును తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ తూకంలో వ్యత్యాసాలు లేకుండా పారదర్శకంగా ధాన్యం సేకరణ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఎదుర్కొంటున్న చిన్నపాటి సాంకేతిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించామన్నారు. అనంతరం సత్యకృష్ణ రైస్‌ మిల్‌ను తనిఖీ చేసి గోనె సంచులు, తేమ కొలిచే యంత్రాలు, తగినంత సిబ్బంది అందుబాటులో ఉన్నారని నిర్ధారించుకున్నారు. తహసీల్దార్‌, పౌర సరఫరాల శాఖ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.

జనగణన విధుల్లో

పారదర్శకత

అమలాపురం రూరల్‌: జనగణన – 2027 విధులను అధికారులు, సిబ్బంది పారదర్శకతతో మే 1 నుంచి నెల రోజుల పాటు నిర్వహించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జనగణన ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం స్వీయ గణన ప్రక్రియ కొనసాగుతోందని, మే నెలలో నిర్వహించే డేటా సేకరణలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, క్షేత్రస్థాయిలో వాస్తవ గణాంకాలను సేకరించడంపై సిబ్బంది దృష్టి సారించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాల్లో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని, బాధ్యతారహితంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

బాస్కెట్‌ బాల్‌ పోటీలు ప్రారంభం

దేవరపల్లి: మండలంలోని రామన్నపాలెం జిల్లా పరిషత్‌ హైస్కూల్లో రెండు రోజుల పాటు జరగనున్న అమరావతి రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్‌ ఇన్విటేషన్‌ కప్‌ టోర్నమెంట్‌ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 12 పురుషుల జట్లు, 6 మహిళా జట్లు పోటీల్లో హోరాహోరీగా తలపడుతున్నాయి. 250 మంది క్రీడాకారులు, 30 మంది పీఈటీలు, కోచ్‌లు, మేనేజర్లు మొత్తం 350 మంది పోటీలకు హాజరయ్యారు. గురువారం సాయంత్రం 5 గంటలకు టోర్నమెంట్‌ ముగుస్తుంది. అనంతపూర్‌–గొల్లలమామిడాడ మహిళా జట్లతో టోర్నమెంట్‌ ప్రారంభించారు. పురుషులు, మహిళా జట్ల పోటీలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన కేర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో టోర్నీ నిర్వహిస్తున్నట్టు శాప్‌ డైరెక్టర్‌ పేరం రవీంద్రనాథ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement