ప్రాణ స్నేహితుల మహా ప్రస్థానం | - | Sakshi
Sakshi News home page

ప్రాణ స్నేహితుల మహా ప్రస్థానం

Apr 23 2026 7:54 AM | Updated on Apr 23 2026 7:54 AM

తాళ్లపూడి: నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అయితే వీరితో పాటు వెళ్లిన గన్నిన నరేంద్ర తీవ్రంగా గాయపడడంతో రాజమహేంద్రవరం ఆసుపత్రికికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నారు. తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామానికి చెందిన చాపర్ల హనుమంతరావు(45), చాపర్ల రాజు(40), కొవ్వూరుకు చెందిన దుద్దుపూడి సాగర్‌ (41) కలిసి డిగ్రీ వరకు చదువుకున్నారు. చాపర్ల హనుమంతరావు హేమోఫిలియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి రక్తం గడ్డ కట్టదు. ఏ చిన్న దెబ్బ తగిలినా ప్రాణాపాయం. అటువంటి స్నేహితుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు మిత్రులు చాపర్ల రాజు, దుద్దుపూడి సాగర్‌. హనుమంతరావుకు మెరుగైన వైద్యం అందించడం కోసం తరచూ చైన్నె తీసుకువెళ్లేవారు. ఈ నెల 19న కూడా అలాగే కారులో చైన్నె వెళ్లారు. చికిత్స ముగించుకుని తిరిగి వస్తుండగా విధి వంచించింది. తెల్లవారుజామున నిద్రమత్తులో కారు సూచిక బోర్డును ఢీకొనడంతో హనుమంతరావుతో పాటు అతనికి అండగా నిలిచిన రాజు, సాగర్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో స్నేహితుడు గన్నిన నరేంద్ర మృత్యువుతో పోరాడుతున్నాడు.

గ్రామంలో విషాద ఛాయలు

చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులుగా మెలిగిన వారు ఇప్పుడు విగత జీవులుగా గ్రామానికి చేరుకోవడంతో గజ్జరం, కొవ్వూరు ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ బిడ్డలు స్నేహం కోసం జీవితాలనే త్యాగం చేశారని, ఇప్పుడు ముగ్గురూ కలిసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తల్లిదండ్రులు ,కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు, పలువురు టీడీపీ నాయకులు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

పెళ్లిళ్లకు దూరం.. స్నేహమే సర్వస్వం

అనారోగ్యంతో ఉన్న హనుమంతరావుకు సేవ చేసేందుకు, అతనికి తోడుగా ఉండేందుకు రాజు, సాగర్‌ పెళ్లిళ్లు కూడా చేసుకోలేదు. ప్రయివేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ.. ‘మా మిత్రుడికి మేమున్నామంటూ‘ నిత్యం అతనితోనే ఉండేవారు.

మృత్యువులోనూ వీడని మిత్ర బంధం

స్నేహితుడి చికిత్స కోసం వెళ్లి..

తిరిగి వస్తుండగా ప్రమాదం

ముగ్గురు అవివాహిత స్నేహితుల దుర్మరణం

గజ్జరం, కొవ్వూరులో విషాద ఛాయలు

Advertisement
 
Advertisement
Advertisement