రెవెన్యూ సేవల్లో నిర్లక్ష్యం కూడదు | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సేవల్లో నిర్లక్ష్యం కూడదు

Apr 22 2026 7:24 AM | Updated on Apr 22 2026 7:24 AM

అమలాపురం: భూ పరిపాలన రెవెన్యూ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ రెవెన్యూ సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్‌ జి.జయలక్ష్మి అమరావతి నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి 22 ఏ భూములు, రిసర్వే, పట్టాదారు పాస్‌ పుస్తకాలు పంపిణీ, ముటేషన్లు, పీజీఆర్‌ఎస్‌ అంశాల పురోగతిపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం రెవెన్యూ సిబ్బందిని ఉద్దేశించి కలెక్టర్‌ మాట్లాడుతూ జాబితాలో ఉన్న భూములపై వచ్చే అభ్యర్థనలను త్వరగా పరిష్కరించాలన్నారు. భూ రీ–సర్వే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, సవరించిన పట్టాదారు పాస్‌ పుస్తకాలను రైతులకు అందజేయాలన్నారు. ఆర్డీవో జి.మమ్మీ, తహసీల్దార్‌ చినబాబు, భూ పరిపాలన సూపరిండెంట్‌ సుబ్బరాజు పాల్గొన్నారు.

కమనీయం..

వీరేశ్వరుని కల్యాణం

ఐ.పోలవరం: మురమళ్ల శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం వీరేశ్వరుని కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఎదురు సన్నాహం, ద్వాదశ ఆలయ ప్రదక్షిణ అనంతరం స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవం కమనీయంగా సాగింది. కల్యాణోత్సవాన్ని తిలకించడానికి ఇతర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు.

సూర్యప్రభ వాహనంపై వీరేశ్వరుడు

ఆదిశైవ అర్చక సంఘ అద్యక్షుడు యనమండ్ర సత్యసీతారామ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకస్వాముల, అధికారుల పర్యవేక్షణలో ఈ అయిదు రోజుల క్రతువు జరుగనుంది. మంగళవారం ఆలయంలో ఉదయం గణపతి హోమం, ప్రధాన కలాశారాధన, వాస్తు పూజ, సాయంత్రం ‘చంద్రప్రభ’ వాహనంపై గ్రామోత్సవం ఘనంగా జరిగాయి. ఏర్పాట్లను ఆలయ ఈవో వై.సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు.

వాడపల్లి వెంకన్నకు

బంగారు నామం సమర్పణ

ఆత్రేయపురం : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నిమ్మల శ్రీను, పద్మ దంపతులు, కుటుంబ సభ్యులు రూ.1 లక్ష 30 వేల విలువైన 8.38 గ్రాముల బంగారు నామం సమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement