హిజ్రా హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవం | - | Sakshi
Sakshi News home page

హిజ్రా హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవం

Apr 22 2026 7:24 AM | Updated on Apr 22 2026 7:24 AM

ఆలమూరు: 216 ఏ జాతీయ రహదారిలోని జొన్నాడలో మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన హిజ్రా హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ రాజమహేంద్రవరం పదవ అదనపు జిల్లా జడ్జి కోర్టు మంగళవారం తుది ఇచ్చింది. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో విలేకరులకు ఈ కేసు గురించి ఆలమూరు పోలీసులు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం మండలంలోనున్న ఉప్పరగూడెంకు చెందిన మరుమట్ల ఆనంద్‌ అలియాస్‌ ఆనందీ అనే హిజ్రా ఆ సమయంలో ధవళేశ్వరంలో సహచర హిజ్రాలతో కలిసి నివాసం ఉంటోంది. 2023 మే 12 రాత్రి జొన్నాడ హైవే పక్కన పంటకాలువలో దారుణ హత్యకు గురైంది. సంచలనంగా మారిన ఈ హత్యకేసుకు సంబంధించి ధవళేశ్వరం గ్రామానికి చెందిన ధనాల మందాకిని అనే హిజ్రా ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై ఎస్‌.శివప్రసాద్‌ కేసును నమోదు చేశారు. రావులపాలెం రూరల్‌ సీఐ ఎన్‌.రజనీకుమార్‌ దర్యాప్తు చేయగా కొత్తపేట డీఎస్పీ కెవి.రమణ పర్యవేక్షణ జరిపారు. నేరం రుజువు కావడంతో నిందితులు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కేత వెంకట భరత్‌ సుధీర్‌ అలియాస్‌ పెద్ద (ధవళేశ్వరం), వేలు కళ్యాణ్‌ అనే పెద కాళీ (బొమ్మూరు), సింగంపల్లి కార్తీకేయ అలియాస్‌ సింబ (ధవళేశ్వరం)కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధిస్తూ జడ్జి ఎస్‌.ఉమా సునంద తీర్పు చెప్పారు. బాధితుల తరఫున పీపీలు కె.రాధాకృష్ణ రాజు, డి.వాణిభాయి వాదనలు వినిపించారు. ఈ కేసును ఛేదించిన కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్‌, రావులపాలెం రూరల్‌ సీఐ సీహెచ్‌ విద్యాసాగర్‌, ఆలమూరు ఎస్సై జి.నరేష్‌ను ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీవీ అశోక్‌కుమార్‌, ఎస్పీ రాహుల్‌ మీనా అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement