● జిల్లాలో నిలిచిపోయిన
మన బడి– నాడు నేడు
● పేరు మార్చారు కాని డబ్బులివ్వడం లేదు
● గత ప్రభుత్వ హయాంలో
పాఠశాలలకు కార్పొరేట్ లుక్
● రెండు దశల్లో 1,197
ఆధునీకరణకు శ్రీకారం
● రూ. 453.96 కోట్ల కేటాయింపు
● చంద్రబాబు సర్కారు వచ్చాక మనబడి.. మన భవిష్యత్‌గా పేరు మార్పు
● ఒక్క రూపాయి కూడా విదల్చని వైనం
● తాజాగా రూ.31 కోట్లతో చేసిన
ప్రతిపాదనలకు అతీగతీ లేదు
సాక్షి, అమలాపురం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు.. చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు పేర్లు మార్చడం.. తరువాత వాటిని పక్కన పెట్టడం చంద్రబాబు ప్రభుత్వానికి సర్వ సాధారణంగా మారింది. పాఠశాలలకు కార్పొరేట్ స్థాయి కల్పించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన మన బడి – నాడు నేడు పథకానికి సైతం బాబు ప్రభుత్వం ‘‘మనబడి– మన భవిష్యత్’’గా పేరు మార్చింది. కాని నిలిచిపోయిన పనులను మాత్రం పూర్తి చేయడం లేదు.
వైఎస్సార్ సీపీ హయాంలో వేగంగా పనులు
జిల్లాలో మండపేట నియోజకవర్గంతో కలిపి మనబడి నాడు–నేడుకు గత ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రెండు దశల్లో మొత్తం 761 పాఠశాలల్లో ఈ పనులు చేపట్టాలని నిర్ణయించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తొలి దశలో మనబడి నాడు–నేడు పథకం ఫేజ్–1లో 436 పాఠశాలల పనులకు రూ.104.96 కోట్లు కేటాయించింది. ఈ పనులు పూర్తి కావడంతో రెండవ దశ నాడు–నేడుకు నాటి ప్రభుత్వం 761 పాఠశాలలను ఎంపిక చేసింది. ఈ పాఠశాలల్లో 1,047 పనులకు రూ.249 కోట్లు కేటాయించింది. నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలోని నాడు–నేడులో ఆధునీకరించిన పి.గన్నవరం ఉన్నత పాఠశాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలిదశ ప్రగతి స్ఫూర్తితో ఇక్కడే రెండవ దశ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. అప్పట్లో నిర్మాణ పనులు వేగంగా సాగాయి. నాటి ప్రభుత్వమే రివాల్వింగ్ ఫండ్ రూ.86 కోట్లు, సెంట్రల్ ప్రొక్యూర్డ్ మెటీరియల్ (సీపీఎం)కు రూ.61 కోట్లు కలిపి మొత్తం రూ.147 కోట్లు విడుదల చేసింది. రెండో దశ పనులకు రివాల్వింగ్ ఫండ్, సీపీఎం రూపేణా రూ.102 కోట్లు విడుదల కావాల్సి ఉండగా ప్రభుత్వం మారింది. దీంతో రెండవ దశ నిర్మాణ పనులు మందగించాయి.
అదనపు నిధులు మంజూరు కానట్టే..
ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి సెలవులు మొదలు కానున్నాయి. జూన్ రెండవ వారంలో పాఠశాలలను తిరిగి తెరచే అవకాశముంది. ఈ సమయంలో మన బడి– మన భవిష్యత్‌కు సంబంధించి నిలిచిపోయిన అదనపు తరగతి గదుల నిర్మాణాలు, మరుగుదొడ్లు, బ్లాక్ బోర్డులు, ఇతర పనులు పూర్తి చేయాల్సి ఉంది. రెండేళ్లుగా పనులు నిలిచిపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వస్తుండటంతో ప్రభుత్వం అత్యవసర పనులు చేపడతామని ప్రతిపాదనలు కోరింది. గతంలో నాడు– నేడుకు అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కేటాయించిన నిధులు పాఠశాలల అకౌంట్లో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వాటి వినియోగంపై ఆంక్షలు విధించింది. అయితే ఇప్పుడు తాగునీరు, మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్ పైపులైన్, డెస్క్‌లు వంటి పనులకు ఆ నిధులను ఖర్చు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. ఇవి కాకుండా ఇంకా పనులు ఉంటే ప్రతిపాదనలు పంపాల్సిందిగా కోరింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ రూ.31 కోట్లతో చేపట్టే అత్యవసర పనులకు సంబంధించి ప్రతిపాదనలు అందజేసింది. అయితే పాఠశాలలకు సెలవు ఇచ్చే సమయం దగ్గర పడుతున్నా ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటి వరకు నిధులు మంజూరు కాకపోవడం విశేషం. ప్రభుత్వం తీరు చూస్తుంటే ఈ ఏడాది కూడా పాఠశాలలో ఉన్న నిధులు ఖర్చు పెట్టడం తప్ప అదనంగా నిధులు ఇచ్చే అవకాశం లేదని తేలిపోయింది.


