దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు | - | Sakshi
Sakshi News home page

దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు

Apr 21 2026 4:26 AM | Updated on Apr 21 2026 4:26 AM

ఐదుగురి అరెస్ట్‌

రూ.1.50 లక్షల నకిలీ నోట్లతో పాటు ప్రింటింగ్‌ సామగ్రి స్వాధీనం

ఎస్పీ రాహుల్‌ మీనా వెల్లడి

అమలాపురం టౌన్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జిల్లా రామచంద్రపురం మండలం అంబికాపల్లి అగ్రహారంలో ఓ కిరాణా షాపు వ్యాపారికి నకిలీ నోటు పరంగా కలిగిన అనుమానంపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు తీగ లాగితే డొంక కదిలినట్టు దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు అయింది. దీంతో దొంగ నోట్ల ముఠా సభ్యులైన కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన దేవి చంద్‌ గెహ్లోట్‌, రామచంద్రపురానికి చెందిన పలివెల నూకరాజు, విశాఖపట్నం జిల్లా శాలిపేటకు చెందిన మీసాల అప్పలరాజు, మండపేట మండలం మేడపాడు గ్రామానికి చెందిన బత్తుల శ్రీను, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాల గ్రామానికి చెందిన మట్టాడి దేవీప్రసాద్‌లను రామచంద్రపురం పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి కోర్డులో హాజరుపరిచారు. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ రాహుల్‌ మీనా ఈ దొంగ నోట్ల ముఠా చేసిన నేరాలను విలేకరులకు వివరించారు. ఈ ముఠా నుంచి రూ.55 వేల నకిలీ రూ.500 నోట్లు, ప్రింటింగ్‌ మెషీన్‌లో ఉన్న రూ.95 వేల నకిలీ రూ.500 నోట్లు కలిపి మొత్తం రూ.1.50 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నగదుతో పాటు రెండు సెల్‌ ఫోన్లు, నకిలీ నోట్లకు సంబంధించిన 46 పేపర్లు, కలర్‌ ప్రింటర్‌, బ్లాక్‌ అండ్‌ వైట్‌ ప్రింటర్‌, రెండు ల్యాప్‌టాప్‌లు, వోల్టేజీ ఫ్రీక్వెన్సీ మెషీన్‌, కీ బోర్డు, కటింగ్‌ మెషీన్లు స్వాధీనం చేసుకున్నారు.

గట్టు రట్టు అయిందిలా..

రామచంద్రపురం మండలం అంబికాపల్లి అగ్రహారంలో గల ఓ కిరాణా షాప్‌ వద్దకు ఇద్దరు వచ్చారు. వారిలో ఒక వ్యక్తి షాపులో కొన్ని వస్తువులు కొనుగోలు చేసి రూ.500 నోటు ఇచ్చాడు. షాపు యాజమానికి నోటుపై అనుమానం వచ్చి పరికించాడు. అది దొంగ నోటుగా గుర్తించాడు. ఆ ఇద్దరు వ్యక్తులను ఆరా తీస్తున్న సమయంలో వారు తమ బైక్‌లపై అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసిన షాపు యజమాని.. వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

తీగ లాగితే డొంక కదిలినట్టు..

ఈ ఫిర్యాదుపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా తీగ లాగితే డొంక కదిలినట్టు దొంగ నోట్ల ముఠా గుట్టు రట్లు అయింది. దొంగ నోటు మార్చేందుకు వచ్చిన దేవి చంద్‌ గెహ్లోట్‌ను విచారించగా.. పలివెల నూకరాజు తనకు పరిచయమై రూ.500 నకిలీ నోట్లు మార్చితే లాభం వస్తుందని చెప్పాడని పోలీసులకు తెలిపాడు. అప్పటి నుంచి వీరద్దరూ గ్రామాల్లో మోటారు సైకిళ్లపై తిరుగుతూ దొంగ నోట్లు మార్చుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

సబ్‌ జైలులో స్నేహం..

దొంగ నోట్ల వ్యాపారానికి శ్రీకారం

పట్టుబడ్డ మరో వ్యక్తి నూకరాజు పోలీసులు ప్రశ్నించినప్పుడు కొత్త విషయం వెలుగు చూసింది. నూకరాజు దొంగతనం కేసులో రామచంద్రపురం సబ్‌ జైలులో ఉండగా.. అతనికి అప్పటికే జైలులో ఉన్న మీసాల అప్పలరాజు, బత్తుల శ్రీను, మట్టాడి దేవిప్రసాద్‌ పరిచయం అయ్యారు. ఈ పరిచయం స్నేహంగా మారి దొంగ నోట్ల ప్రింటింగ్‌ చేసేందుకు ప్లాన్‌ చేశారు. దీంతో విశాఖపట్నంలో దొంగ నోట్లు ముద్రించడానికి అవసరమైన మెషీన్లు, సామగ్రి కొనుగోలు చేశారు. అలా వీరి దొంగ నోట్ల ప్రస్థానం మొదలైంది. మండపేట మండలం వేములపల్లి శివారులో బత్తుల శ్రీను రూమ్‌ను దొంగ నోట్ల ముద్రణకు అడ్డాగా చేసుకున్నారు. రామచంద్రపురం సీఐ ఎం.వెంకటరమణ, ఎస్సై ఎస్‌.నాగేశ్వరరావు, కానిస్టేబుళ్లు ఏసు, యు.సూరిబాబు, టి.సూరిబాబు బృందం బత్తుల శ్రీను రూమ్‌పై దాడి చేసి నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లను ఎస్పీ మీనా అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement