అల్లవరం: తెలుగుదేశం కార్యకర్తలు తలుచుకుంటే వైఎస్సార్ సీపీ వారు గుమ్మం బయటకు రాలేరని, నరకి పారేస్తామని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పేర్కొన్నారు. ఆయన మంచి డాక్టర్‌కి చూపించుకుని రోగాన్ని నయం చేసుకోవాలని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. బుచ్చయ్యచౌదరికి వయసు పెరగడంతో పాటు బుద్ధి లోపించిందని, ఎమ్మెల్యేకు తక్కువ.. వీధి రౌడికి ఎక్కువగా వ్యవహరిస్తున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారశైలి గమనిస్తే గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై విచక్షణా రహితంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. టీడీపీలో చాలామంది ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, సమాజంలో మహిళలు, ఉద్యోగులు, బాలికలకు వీరి వల్ల రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ పనితీరును, ఎమ్మెల్యేల ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో బుద్ధి చెబుతారని ఇజ్రాయిల్ పేర్కొన్నారు.
ఫ్యాప్టో చలో విజయవాడ
కరపత్రాల విడుదల
అమలాపురం టౌన్: ఈ నెల 25 నుంచి మూడు రోజులపాటు విజయవాడలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర స్థాయి నిరసన కార్యక్రమాలను జిల్లాలోని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఎంటీవీ సుబ్బారావు, జనరల్ సెక్రటరీ పోతంశెట్టి దొరబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో చలో విజయవాడ కర పత్రాలను వారు విడుదల చేశారు. ఉపాధ్యాయుల దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 25, 26, 27 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్ వద్ద రాష్ట్ర స్థాయి రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు సుబ్బారావు తెలిపారు. కరపత్రాల విడుదల కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా ప్రతినిధులు కె.కళ్యాణ్‌బాబు, షబ్బీర్ హుస్సేన్, జీవీవీ సత్యనారాయణ, ఎండీ ఖాజా మొయినుద్దీన్, పెంకే వెంకటేశ్వరరావు, షానవాజ్ హుస్సేన్ మాజీంద్రాణి పాల్గొన్నారు.
జనగణన పేరిట
సైబర్ మోసాలు
– జనం అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
అమలాపురం రూరల్: జనగణన పేరుతో సైబర్ నేరగాళ్లు ఇళ్లకు రావడం, ఫోన్లు చేసి తాము జనగణన సిబ్బంది అని చెప్పి ఓటీపీలు, ఇతర వివరాలు అడుగుతారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆర్. మహేష్‌కుమార్ సోమవారం సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జనగణన ముమ్మరంగా జరుగుతోందన్నారు. జనాభా లెక్కించే సిబ్బంది మీ నుంచి సెల్ ఫోన్ నంబర్ తప్ప ఓటీపీలు అడగరన్నారు. వేలిముద్రలు, కళ్ల నుంచి ఐరిస్ తీసుకోరని, ఎవరైనా అడిగితే చెప్పొద్దని కలెక్టర్ సూచించారు. జనగణన ప్రక్రియపై ఆయన ప్రజలను అప్రమత్తం చేశారు. మే 1 నుంచి 30 వరకు సిబ్బంది ఇళ్లకు వచ్చి ఇంటి వివరాలు సేకరిస్తారన్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు వచ్చే సందేహాల నివృత్తికి సమస్యల పరిష్కారానికి 1855 టోల్ నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడవచ్చునన్నారు.ి ససిబ్బంది ప్రవర్తన శైలి, వారితో ఏమైనా సమస్యలు ఉంటే 1855కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చునన్నారు. జిల్లావ్యాప్తంగా 2,408 మంది ఎన్యుమరేటర్లు, 388 మంది పర్యవేక్షకులు ఉన్నారన్నారు. జన గణనకు వచ్చిన సిబ్బంది నిజమైన వారా లేదా సైబర్ నేరగాళ్ల అని పరీక్ష చేయాలని, సిబ్బంది మెడలో గుర్తింపు కార్డు ఉందా లేదా అన్నది ప్రజలు గమనించాలన్నారు. గుర్తింపు కార్డులో క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, దాన్ని స్కాన్ చేస్తే అతని వివరాలు కనిపించాలన్నారు. అప్పుడే వారు నిజమైన సిబ్బంది అని నిర్ధారించుకోవాలన్నారు.
గంజాయి నిందితుల అరెస్ట్
రంపచోడవరం: మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 18న పరారైన గంజాయి తరలింపు నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ టీజీఎన్ ప్రసాద్, ఎస్సై కె.శ్రీనివాసరావు తెలిపారు. మారేడుమిల్లి శివారు జీఎం వలస జంక్షన్‌లో సోమవారం పట్టుకున్నామన్నారు. ఇందులో అప్సల్ ఆర్‌ఏ (కర్ణాటక), నఫ్రాజ్ (కేరళ), ఫైజాన్ రజాక్ సికే (కర్ణాటక) ఉన్నారన్నారు. ధారకొండ నుంచి 152 కిలోల గంజాయిని కారులో మారేడుమిల్లి మీదుగా బెంగళూరు తరలిస్తూ పోలీసులను చూసి పరారయ్యారు.


