ఐ.పోలవరం: నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శైవాగమ పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామశర్మ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు కార్యక్రమాలలో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, స్వామి, అమ్మవార్లకు అభిషేకం అనంతరం వధూవరులను చేయడం కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం ధ్వజారోహణ, స్వామివారిని అమ్మవారిని భద్రపీఠంపై ఊరేగించారు. ఆలయ చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి. సత్యనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఉత్సవ మూర్తుల దాత శ్రీ జంపన రామకృష్ణంరాజు దంపతులు, ధర్మకర్త మండలి సభ్యులు, భక్తులు, గ్రామస్తులు, స్థానిక మహిళామండలి సభ్యులు పాల్గొన్నారు.
రెండవ రోజు కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు మంగళవారం వాస్తు పూజ, వాస్తు హోమం, అభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, సాయంత్రం చంద్ర ప్రభ వాహనంపై ఊరేగింపు, ఎదురు సన్నాహం, ద్వాదశ ప్రదక్షిణ, అనంతరం కల్యాణం జరుగుతుందని అధికారులు తెలిపారు.


