సహ ఉద్యోగినిపై లైంగిక వేధింపులు | - | Sakshi
Sakshi News home page

సహ ఉద్యోగినిపై లైంగిక వేధింపులు

Apr 21 2026 4:26 AM | Updated on Apr 21 2026 4:26 AM

అమలాపురం టౌన్‌: అమలాపురం మున్సిపాలిటీలో ఓ వార్డు సచివాలయ సెక్రటరీగా ఉన్న, ప్రస్తుతం మున్సిపల్‌ కార్యాలయం కమాండ్‌ కంట్రోల్‌ విభాగంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి తనను లైంగికంగా వేధిస్తున్నాడని అదే మున్సిపాలిటీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఐసీడీఎస్‌ జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ (పీడీ) కె.నాగమణికి లిఖిత పూర్వకంగా చేశారు. ఆ మహిళా ఉద్యోగి తన పేరు, చిరునామా ప్రస్తావించకుండా ఫిర్యాదు చేయడంతో ఆమె ఎవరు? అనే కలకలం మున్సిపల్‌ కార్యాలయంతోపాటు పట్టణంలోని 15 వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో రేగింది. ఆమె తన ఫిర్యాదులో విజయ్‌కుమార్‌ అనే ఉద్యోగి లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఆమె ఈ ఫిర్యాదు నెల రోజుల కిందటే చేశారు. ఫిర్యాదు అందుకున్న ఐసీడీఎస్‌ పీడీ నాగమణి వెంటనే దీనిపై సమగ్ర విచారణ జరిపి తనకు నివేదిక పంపమని మున్సిపల్‌ కమిషనర్‌ వి.నిర్మల్‌ కుమార్‌కు సూచించారు. ఆమె ఫిర్యాదు పంపించి నెల రోజులు గడస్తున్నా ఇంత వరకూ పీడీకి నివేదిక వెళ్లలేదు. బాధితురాలు ఫిర్యాదులో పేరు ప్రస్తావించకపోవడంతో మున్సిపల్‌ అధికారులు ఈ ఫిర్యాదును తేలికగా తీసుకున్నట్లు తెలిసింది. ఇదే విషయమై ఐసీడీఎస్‌ జిల్లా పీడీ నాగమణిని ‘సాక్షి’ సంప్రదించగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఓ మహిళ ఉద్యోగి తనకు ఫిర్యాదు చేసిన విషయాన్ని వివరించారు. తనకు ఫిర్యాదు అందగానే తాను దీనిపై విచారణ చేసి నివేదిక పంపాలని మున్సిపల్‌ కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా సూచించానని చెప్పారు. ఫిర్యాదు పంపించి నెల రోజులు కావస్తున్నా ఇంకా తనకు నివేదిక పంపలేదని నాగమణి తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ నిర్మల్‌కుమార్‌ను కూడా ‘సాక్షి’ సంప్రదించింది. దీనిపై విచారణ చేస్తున్నామని, త్వరలోనే నివేదిక పంపిస్తానని చెప్పారు. బాధితురాలు పేరు, చిరునామా లేకుండా ఆకాశ రామన్న ఉత్తరం మాదిరిగా పంపించడంతో ఫిర్యాదులో ఎంత వరకూ వాస్తవికత ఉందో పరిశీలిస్తున్నామన్నారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 36 అర్జీలు

అమలాపురం టౌన్‌: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 36 అర్జీలు వచ్చాయి. అర్జీదారులతో ఎస్పీ రాహుల్‌మీనా ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి ఆయా స్టేషన్లకు ఫోన్లు చేసి సీఐ, ఎస్సైలతో చర్చించారు. అర్జీల్లో ఎక్కువగా కుటుంబ తగాదాలు, ఆస్తుల వివాదాలకు సంబంధించినవి ఉన్నాయి.

ఐసీడీఎస్‌ పీడీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన బాధితురాలు

విచారణ చేసి నివేదిక ఇవ్వాలని

మున్సిపల్‌ కమిషనర్‌కు సూచన

అమలాపురం మున్సిపల్‌

కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి

Advertisement
 
Advertisement
Advertisement