బెంగాలీలపై బెంగ! | - | Sakshi
Sakshi News home page

బెంగాలీలపై బెంగ!

Apr 20 2026 8:17 AM | Updated on Apr 20 2026 8:17 AM

జిల్లాలో కుదేలైన ఇటుకల పరిశ్రమలు

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలలో

ఓటు వేసేందుకు వెళ్లిన కూలీలు

ఉత్పత్తి లేక అమాంతం పెరిగిన ధర

అదే స్థాయిలో ముడిసరకు

ధరలకు రెక్కలు

నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం

ఆలమూరు: వలస కూలీల మీదే ఆధారపడిన ఇటుక పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరితో భవన నిర్మాణ రంగం కుదేలైన తరుణంలో ఇటుక ధర క్రమేపీ పెరుగుతోంది. మరో వైపు ముడిసరకు ధరలు అమాంతంగా పెరిగిపోతుండటంతో బట్టీ యజమానికి అనుకున్న మేర గిట్టుబాటు ధర లభించడం లేదు. నెల రోజుల క్రితం ఒక్కొక్క ఇటుక ఖరీదు రూ.4.5 వరకూ ఉండగా ప్రస్తుతం రూ.8.5 చేరుకుంది. ఈ నెల 23, 29న పశ్చిమ బెంగాల్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూలీలు దశలవారీగా వెళ్లిపోతున్నారు. వేసవి పూర్తయితే కానీ వారు వచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటుక ఉత్పత్తి తగ్గిపోవడంతో కొరత వల్ల ధర పెరిగిపోయింది. చిన్న తరహా పరిశ్రమల యజమానులు తమ దగ్గర ఉన్న ఇటుకను ఆర్థిక లావాదేవీల కోసం పూర్తిగా విక్రయించుకోగా కొంతమంది కార్పొరేట్‌ స్థాయి బట్టీ యజమానుల దగ్గర ఇటుక పుష్కలంగా ఉంది. దీంతో వారు రోజురోజుకీ ధర పెంచుతూ పోతున్నారు. ఇదే పరిస్థితి నెలల తరబడి కొనసాగితే జిల్లాలో మూడు వంతుల బట్టీలు మూసివేయక తప్పని పరిస్థితి. ఇటుక ధర పెరుగుతుందని భావిస్తున్న తరుణంలో ముడిసరకు ధరలను కూడా వ్యాపారులు ఇష్టానుసారం పెంచేస్తున్నారని ఇటుక పరిశ్రమ యజమానులు వాపోతున్నారు. ఈ పరిస్థితి భవన నిర్మాణదారునిపై విపరీతమైన ప్రభావం చూపనుంది.

ఆ కూలీలు వస్తేనే

ఉమ్మడి జిల్లాలోని సుమారు రెండు వేల వరకూ ఇటుక బట్టీలు ఉండగా జిల్లాలో దాదాపు 800 బట్టీల వరకూ ఉన్నాయి. జిల్లాలోని 19 మండలాలతో పాటు కొన్ని నదీ పరివాహక సరిహద్దు ప్రాంతాలు ఇటుక తయారిలో కీలక పాత్ర పోషిస్తూ అధిక ఉత్పత్తి సాధించేందుకు దోహదపడుతున్నాయి. జిల్లాలోని బట్టీల్లో పని చేస్తున్న సుమారు 25 వేల మంది కార్మికులలో 70 శాతం మంది బెంగాలీ కూలీలే. 20 శాతం ఒడిశా, బీహార్‌, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. పది శాతం మంది మాత్రమే స్థానిక కూలీలు పనిచేస్తున్నారు. ఈ బట్టీల ద్వారా ఇప్పటి వరకూ జిల్లాలో దాదాపు 20 లక్షల వరకూ ఇటుక ఉత్పత్తి అవుతుండగా బెంగాలీ కూలీలు లేకపోవడం వల్ల కేవలం ఐదు లక్షలకు పడిపోయింది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు స్థానిక ఇటుక ఎగుమతులు అధికంగా ఉండడం కూడా ధరల పెరుగుదలకు కారణమైంది. ఇటుక ఉత్పత్తికి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో కేవలం కూలీల మీదనే ఆధారపడటం కూడా ఒక్కొక్కసారి ఇటుక పరిశ్రమ సంక్షోభానికి కారణమవుతోంది.

బెంగాలీ కూలీల ప్రభావం

తీవ్రంగా ఉంది

ఇటుక పరిశ్రమ మనుగడపై ప్రస్తు తం బెంగాలీ కూలీల ప్రభావం తీ వ్రంగా ఉంది. ఇటుక ధర పెరుగుతు న్నా కూలీల కొరత వల్ల పూర్తిస్థాయిలోఉత్పత్తి జరగ డం లేదు. దీనికి తోడు ముడిసరకు ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వేసవి సీజన్‌లో కూలీల కొరత రావడంతో పరిశ్రమకు ఇబ్బందికరంగా మారింది.

– చల్లా ప్రభాకరరావు, ఇటుక పరిశ్రమ

జిల్లా సమాఖ్య అధ్యక్షుడు, ఆలమూరు

చొప్పెల్లలో ఇటుక తయారీ చేస్తున్న బెంగాలీ కూలీలు (ఫైల్‌)

ముడి సరకు గత ధర కొత్త ధర

నల్లమట్టి ట్రాక్టర్‌) 1,500 2,500

బొండు ఇసుక (లారీ) 7,500 11,500

ఊక (టన్ను) 3,500 4,000

బూడిద (టన్ను) 1,000 1,800

పుల్లలు (టన్ను) 1,800 3,200

పెరిగిన ముడి సరకు ధరలు

ఇటుక ధరలు ఆశాజనకంగా ఉన్నాయని భావిస్తున్న తరుణంలో ముడిసరకు ధరల పెరుగుదల కూడా అదే స్థాయిలో పెరిగింది. గత ఏడాది ధరలతో పోలిస్తే ప్రస్తుతం సుమారు 50 నుంచి 150 శాతం వరకూ ముడిసరకు ధరలు పెరిగిపోయాయి. అలాగే బెంగాలీ కార్మికుల కొరతతో పరిశ్రమలో పోటీతత్వం పెరిగి కూలీలకు చెల్లించే ధర కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో వెయ్యి ఇటుక తయారీకి సుమారు రూ.ఐదు వేల వరకూ ఖర్చు అవుతుంది. గతంలో ఇటుక తయారీకి కూలీలకు సగటున రూ.900 వరకూ ఖర్చు అవుతుండగా ప్రస్తుతం రూ.1400 చేరుకుంది. గతంలో ప్రదేశాన్ని, సానుకూలతను బట్టి ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకూ ఉన్న లీజు ధర ప్రస్తుతం రూ.2.5 లక్షల నుంచి రూ.మూడు లక్షల వరకూ చేరుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement