అమలాపురం రూరల్: పీజీఆర్‌ఎస్, మీ కోసం రెవెన్యూ క్లినిక్ సోమవారం యథావిధిగా ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్ గోదావరి భవన్‌లో డివిజన్, మండల కేంద్రంలో పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తారన్నారు. అర్జీలను వెబ్‌సైట్ ద్వారా కానీ, ఆన్‌లైన్‌లో కానీలో నమోదు చేసుకుని పరిష్కార మార్గాలు పొందాలన్నారు. నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి తదితర వివరాల కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు నేరుగా కాల్ చేసి పరిష్కార స్థితిగతులను తెలుసుకొనవచ్చునని కలెక్టర్ సూచించారు.
విద్యార్థులూ..
లైసెన్స్‌లు పొందండి
అమలాపురం రూరల్: ఈ వేసవి సెలవుల్లో 18 ఏళ్లు నిండిన విద్యార్థులు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని, ఇందుకు వారి తల్లితండ్రులు సహకరించాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు ఆదివారం విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు మందుగా parivahan.saradhi.gov.in సైట్‌లో లెర్నింగ్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకుని డీటీఓ కార్యాలయంలో మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ల సమక్షంలో పరీక్షకు హాజరై లెర్నింగ్ లైసెన్స్ పొందాలన్నారు. 30 రోజుల తరువాత డ్రైవింగ్ టెస్ట్‌కు స్లాట్ బుక్ చేసుకుని హాజరు కావాలన్నారు. నిరక్షరాస్యులు నేరుగా స్లాట్ బుకింగ్ ప్రక్రియని డీటీఓ కార్యాలయం హెల్ప్ డెస్క్ ద్వారా పొందాలని తెలిపారు. కలెక్టర్ సూచనలతో ఈ స్లాట్ బుకింగ్ సదుపాయం స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాలలో పొందేలా ఏర్పాటు చేశామని, ప్రజలు గమనించాలని డీటీఓ కోరారు. డ్రైవింగ్ లైసెన్సులకు, స్లాట్ బుకింగ్‌లకు దళారులను ఆశ్రయించి సమయాన్ని డబ్బును వృథా చేసుకోవద్దని డీటీఓ సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే 92816 07021 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు గూగుల్ సెర్చ్‌లో ఆర్‌టీఓ రోడ్డు ట్రాఫిక్ సిగ్నల్స్ అని టైపు చేసి తెలుసుకోవచ్చని డీటీఓ పేర్కొన్నారు.
సీఏఐటీ ఉపాధ్యక్షుడిగా
శివశంకర్
యానాం: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వైస్ ప్రెసిడెంట్‌గా శివశంకర్ మరోసారి ఎన్నిక కాగా, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా యానాంకు చెందిన మాజేటి సత్యభాస్కర్ వెంకటేశ్వర్ ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా వ్యాపారవేత్తల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తూ, కేంద్ర ప్రభుత్వం, ట్రేడింగ్ వర్గాల మధ్య సమన్వయ వేదికగా పనిచేస్తున్న ఆ సంస్థ జాతీయ స్థాయి ఎన్నికలు ఈ నెల 16న జరిగాయి. ఈ ఎన్నికలలో పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన శివశంకర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా రెండోసారి ఎన్నికయ్యారు. సత్యభాస్కర్ ఎంపిక పట్ల యానాం వర్తక సంఘం అధ్యక్షుడు నల్లా వెంకన్న, సెక్రటరీ కాపగంటి గోపాలకృష్ణ, వర్తక సంఘం ప్రతినిధులు అభినందించారు.
నర్సరీలో మొక్కల నరికివేత
కడియం: మండలంలోని దామిరెడ్డిపల్లిలో సుమారు రూ.6 లక్షల విలువైన నర్సరీ మొక్కలను గుర్తు తెలియని దుండగులు నరికేశారు. గ్రామంలోని పోలేరమ్మ గుడి సమీపాన ఏడు కుంచాల చేనులో బాధితుడు, ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు విత్తనాల సాయికుమార్ కౌలు వ్యవసాయం చేస్తున్నారు. అందులో మిర్చి మేరీ గ్రీన్, పోక రకాలకు చెందిన 25 అంగుళాల బ్యాగు సైజు మొక్కలు పెంచుతున్నారు. ఈ నెల 13వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ నర్సరీలోకి చొరబడి మొక్కల మొవ్వులను నరికేశారు. మొత్తం మొక్కలన్నిటినీ ఇదే విధంగా చేయడంతో తనను నష్టపరచడానికి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని సాయికుమార్ గ్రహించారు. దీనిపై కడియం పోలీసులకు ఈ నెల 14న ఫిర్యాదు చేశారు. ఈ వివరాలను ఆయన ఆదివారం స్థానిక విలేకర్లకు వెల్లడించారు. తనకు ఎవ్వరితోనూ వివాదాలు లేవని, తనను ఇంతగా నష్టపరచాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో అర్థం కావడం లేదని సాయికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మొవ్వులు నరికేసిన మొక్కలు తిరిగి కోలుకోవని చెప్పారు.


