ఆహా.. వకాయ | - | Sakshi
Sakshi News home page

ఆహా.. వకాయ

Apr 20 2026 8:17 AM | Updated on Apr 20 2026 8:17 AM

మొదలైన ఊరగాయల సీజన్‌

జోరుగా పచ్చడి మామిడి అమ్మకాలు

ఇతర రాష్ట్రాలకూ ఎగుమతులు

పిఠాపురం: ఆవకాయ– ఈ మాట వింటే ఎవ్వరికై నా నోరూరిపోతూంటుంది. ముద్దపప్పు అన్నంలో కాసింత నెయ్యి వేసుకుని, ఆవకాయ నంజుకుని తింటే ఆ రుచికి వేరేదీ సాటి రాదని భోజన ప్రియులు అంటూంటారు. ఆంధ్రాలో పుట్టిన ఈ ఆవకాయ రుచికి తెలుగువాళ్లే కాదు.. ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు సైతం ఫిదా అవుతూంటారు. ప్రస్తుతం సీజన్‌ కావడంతో దాదాపు ప్రతి ఇంటా ఆవకాయల తయారీ ఊపందుకుంటోంది. దీనికి తగినట్టుగానే మార్కెట్లో పచ్చి మామిడికాయల అమ్మకాలు కూడా జోరందుకుంది. అంతేకాదు.. మిరప పంటకు పెట్టింది పేరైన గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో ఎండు మిర్చి అమ్మకాలు సైతం ఊపందుకున్నాయి.

ఎన్ని రకాలో..

ఆవకాయలో మళ్లీ ఎన్నో రకాలున్నాయి. బెల్లం ఆవకాయ, అల్లం ఆవకాయ, నూపిండి ఆవకాయ, పులిహోర ఆవకాయ, పెసర ఆవకాయ, పచ్చ ఆవకాయ, శనగల ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, ఎండు ఆవకాయ వంటి రకాలున్నాయి. వీటితో పాటు మెంతికాయ, మాగాయ, తొక్కుడు పచ్చడి (తురుము మాగాయ), ఉడుకు మాగాయ, పిందె మాగాయ వంటి ఊరగాయలను ఎక్కువ మంది పెడుతూంటారు. వీటి కోసం చెరకురసాలు, కొత్తపల్లి కొబ్బరి, కలెక్టర్‌ తదితర అనేక రకాల మామిడి కాయలను ఉపయోగిస్తూంటారు. దీంతో, సీజన్‌ ప్రారంభం నుంచీ వీటికి మంచి గిరాకీ ఉంటుంది.

విదేశాలకు సైతం..

జిల్లావ్యాప్తంగా సుమారు 48 వేల హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. ప్రస్తుతం చిన్న సైజులో ఉన్న కాయలను రోజువారీ వంటల కోసం విక్రయిస్తున్నారు. ముదిరిన కాయలను ఊరగాయలకు అమ్ముతున్నారు. ప్రస్తుతం ఊరగాయలకు ఉపయోగించే కేజీ పచ్చి మామిడి కాయల ధర రూ.35 నుంచి రూ.45 వరకూ పలుకుతోంది. సైజును బట్టి కేజీకి ఐదారు కాయల వరకూ వస్తాయి. జిల్లావ్యాప్తంగా నిత్యం సుమారు 120 టన్నులకు పైగా మామిడి కాయల అమ్మకాలు జరుగుతున్నాయన్నది అధికారుల అంచనా. మన జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సైతం మామిడి కాయలు ఎగుమతి అవుతున్నాయి. గత ఏడాది 30 శాతం కాయలు శ్రీలంకకు ఎగుమతి అయ్యాయట. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా ఒమన్‌, కువైట్‌, బెల్జియం, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, వియత్నాం తదితర దేశాలున్నాయి. దాదాపు 50కి పైగా దేశాలకు మన ఆవకాయ తదితర ఊరగాయలు సైతం ఎగుమతి అవుతున్నాయి.

పచ్చని కాయలు.. పచ్చడికి సిద్ధం

Advertisement
 
Advertisement
Advertisement