అమృతం.. ఆలస్యం! | - | Sakshi
Sakshi News home page

అమృతం.. ఆలస్యం!

Apr 19 2026 7:53 AM | Updated on Apr 19 2026 7:53 AM

రూ.1,650 కోట్లతో డెల్టాలో పనులు

వైఎస్సార్‌ సీపీ హయాంలోనే

అంకురార్పణ

మూడు జిల్లాల పరిధిలో 451 గ్రామాలకు

ఇంటింటికీ నేరుగా జలాలు లక్ష్యం

గత ప్రభుత్వంలోనే టెండర్లు..

శరవేగంగా సర్వేలు

చంద్రబాబు ప్రభుత్వంలో మందగమనం

సాక్షి, అమలాపురం: డెల్టా ప్రజలకు వారి ఇళ్లకే నేరుగా గోదావరి జలాలు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన ‘అమృత ధార’ పథకం (వాటర్‌ గ్రిడ్‌) నత్త నడకన సాగుతోంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో పురుడుపోసుకున్న ఈ పథకానికి ఆ కాలంలోనే టెండర్లు.. సర్వే పనులు చురుగ్గా సాగాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పనులు మందగించాయి. ఎట్టకేలకు భూసేకరణ పూర్తవుతుండడంతో నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. జిల్లాతో పాటు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోని 11 నియోజకవర్గాలలోని 32 మండలాల్లోని 451 గ్రామాలలో ఇంటింటికీ నేరుగా తాగునీరు అందించాలన్నది ఈ పథకం లక్ష్యం. దీని వల్ల సుమారు 14.03 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నీటిని సేకరించి మున్సిపాలిటీ, గ్రామాలలో ఉన్న రక్షిత నీటి పథకాల ద్వారా సరఫరా చేస్తారు. ఇప్పుడున్న రక్షిత నీటి పథకాలకు గోదావరి పంట కాలువల ద్వారా నీరందుతోంది. గోదావరి కన్నా రెండు, మూడు రెట్లు కలుషితమైన పంట కాలువల ద్వారా నీరు అందించడం కన్నా నేరుగా అందిస్తే సురక్షిత నీరు అందడంతో పాటు వేసవిలోనూ నీటి ఎద్దడి ఉండదు. దీనికి సమాంతరంగా కేంద్ర ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటిటా పైప్‌లైన్లు వేయడం వల్ల ఈ పథకం వల్ల ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందని నాటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం భావించింది. 2022లో ‘డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్టు ఇన్‌ కోస్టల్‌ ఏరియా’ అనే పథకంలో రూ.1,650 కోట్లను కేటాయించింది. ఈ పనులకు మెగా ఇంజినీరింగ్‌ సంస్థ కాంట్రాక్ట్‌ పొందింది. గత ప్రభుత్వ హయాంలో 2024లో టెండర్లు ఖరారవడంతో పాటు 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

పాత పథకాలకు అనుసంధానం

ఉమ్మడి జిల్లాలో డెల్టా పరిధిలో ఉన్న 31 సీడబ్ల్యూసీ, 390 పీడబ్ల్యూసీ పథకాల ద్వారా తాగునీరు అందుతోంది. పాత ప్రాజెక్టులకు అనుసంధానంగా కొత్త నిర్మాణం చేయాలని గతంలోనే నిర్ణయించారు. ఇప్పటికే జలజీవన్‌ మిషన్‌లో ఇంటింటా పైప్‌ లైన్‌ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆయా మండలాల్లో ఉన్న ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల సామర్థ్యాన్ని పరిశీలించి అవసరమైన చోట కొత్త ట్యాంకులు నిర్మించనున్నారు.

చంద్రబాబు ప్రభుత్వ వచ్చాక ఆలస్యం

‘అమృత ధార’ నిర్మాణంలో భాగంగా ర్యాపిడ్‌ శాండ్‌ ఫిల్టర్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌)లను ఒక్కొక్క దానిని 30 నుంచి 50 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్‌ పెర్‌ డే) సామర్థ్యంతో నిర్మిస్తారు. ఇక్కడ నీటిని అధునాతన పద్ధతిలో వడగొట్టి అక్కడ నుంచి ఓవర్‌ హెడ్‌ స్టోరేజ్‌ రిజర్వాయర్‌ (ఓహెచ్‌ఎస్‌ఆర్‌), ఓవర్‌ హెడ్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (ఓహెచ్‌బీఆర్‌)లకు పంపిస్తారు. వీటి నిర్మాణాలకు అవసరమైన భూమిని అప్పడే గుర్తించారు. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు మందగించాయి. ఒకానొక సమయంలో పనులు ఆగిపోతాయనే సందేహం కూడా కలిగింది. భూసేకరణ ఆలస్యం కావడంతో పనుల ప్రారంభానికి తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. మధ్య డెల్టాకు సంబంధించి తొలుత ఆత్రేయపురం మండలం వద్దిపర్రు వద్ద 12 ఎకరాలు సేకరించాలని నిర్ణయించినా ఆచరణలోకి రాలేదు. తాజాగా ఇదే మండలం వసంతవాడలో 9.5 ఎకరాల భూసేకరణ జరగడంతో భూమి చదును చేసే పనులు మొదలయ్యాయి. దీనికి అనుబంధంగా పి.గన్నవరం, రాజోలు తదితర ప్రాంతాల్లో పైప్‌లను అందుబాటులో ఉంచి పనులు మొదలు పెట్టారు. తూర్పు డెల్టాకు సంబంధించి ఫిల్టర్‌ బెడ్ల నిర్మాణానికి కడియం మండలం జేగురుపాడులో స్థలాన్ని సేకరించాలని భావించారు. చివరకు ధవళేశ్వరంలోని ఇరిగేషన్‌ స్థలాన్ని సేకరించి పనులు ప్రారంభించారు. ఇప్పటికై నా ప్రభుత్వం దీనిని దృష్టిలో పెట్టుకుని పనులు వేగవంతం చేయాలని డెల్టావాసులు కోరుతున్నారు.

ఆత్రేయపురం మండలం వసంతవాడ వద్ద భూమిని చదును చేస్తున్న పొక్లెయిన్లు

Advertisement
 
Advertisement
Advertisement