అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వైఖోమ్ నిడియా దేవిని నియమిస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జేసీగా పనిచేసిన టి.నిశాంతి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా పద్నోతిపై బదిలీ అయ్యారు. ఈనెల 4వ తేదీన ఆమె ఇక్కడ నుంచి రీలీవ్ అయ్యారు. అప్పటి నుండి ఆ బాధ్యతలను కలెక్టర్ అర్.మహేష్‌కుమార్ నిర్వహస్తున్నారు. రాష్ట్ర సచివాలయంలో జీఏడీ విభాగంలో పనిచేస్తున్న నిడియా దేవిని జిల్లా జేసీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయినట్టు రెవిన్యూ వర్గాలు తెలిపాయి. రెండు రోజుల్లో ఆమె బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి.
హోటళ్లపై దాడులు
● 18 సిలిండర్లు స్వాధీనం
● గృహావసర సిలిండర్ల
దుర్వినియోగంపై కఠిన చర్యలు
● డీఎస్‌వో ఉదయభాస్కర్
అమలాపురం రూరల్: గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ హెచ్చరిక జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు భారీగా పట్టుబడినట్టు ఆయన తెలిపారు. హొటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న 18 గృహావసర సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకుని 12 సంస్థలపై 6ఏ కేసులు నమోదు చేశారు. ఇలా దుర్వినియోగం చేసే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగించడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. రీ–ఫిల్లింగ్‌పై నిఘా ఉంచామని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో కమర్షియల్ గ్యాస్ సరఫరాను 70 శాతానికి పెంచినట్టు తెలిపారు. ఈ దాడులలో ఏఎస్‌ఓ శరత్ పీఎంయూ ప్రతినిధి వి.చంద్రశేఖర్ రెడ్డి, సీఎస్‌డీటీలు ఇస్మాయిల్, భారతి పాల్గొన్నారు.
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిటకిటలాడింది. సత్యదేవుని సన్నిధికి రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తులు తరలి రావడంతో ఉదయం నుంచి రాత్రి వరకూ కూడా రద్దీ కొనసాగింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 1,500 జరిగాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సర్కులర్ మండపం వద్ద సుమారు 5 వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోదనం పంపిణీ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగనుంది. సుమారు 40 వేల మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తొలి తిరుపతి కిటకిట
సామర్లకోట: తొలి తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శృంగార వల్లభ స్వామి ఆలయం ఽశనివారం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాలతో పాటు కాలి నడకన పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయాన్ని పూలమాలలతో విశేషంగా అలంకరించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి తెల్లవారుజామున ఇచ్చిన తొలి హారతిని దర్శించడానికి భక్తులు పోటీ పడ్డారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,63,500, అన్నదాన విరాళాలు రూ.65,516, కేశఖండన ద్వారా రూ.5,520, లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.20,235, ఇతరత్రా కలిపి రూ.2,54,871 ఆదాయం వచ్చిందని వివరించారు. సుమారు 2,500 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారన్నారు. వేసవి నేపథ్యంలో ఆలయం వద్ద మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద వాహనాల పార్కింగ్‌కు పంచాయతీ ఆశీలు వసూలు చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది.


