వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు
యానాం: కేంద్రపాలిత ప్రాంతం యానాంలో పెట్రోలు, డీజిల్ లభించక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం పట్టణంలోని పలు బంకులు మూసివేయగా, తెరచి ఉన్న పెట్రోలు బంకుల్లో స్టాకు లేదంటుండడంతో వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో అవసరానికి మించి సుమారు పదికి పైగా పెట్రోలు బంకులు ఉన్నాయి. అయితే అత్యవసర సమయాల్లో స్థానికులకు పెట్రోలు, డీజిల్ లభించని పరిస్థితి నెలకొంటోంది. స్థానికేతరులకు మాత్రం బ్లాక్ మార్కెట్‌లో విచ్చలవిడిగా విక్రయిస్తుంటారు. ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో కొన్ని రోజులుగా పెట్రో ధరలు పెరుగుతాయని ప్రచారం జరగడంతో కొందరు యాజమానులు చమురు నిల్వచేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులకు చెందిన వాహనాల్లో సైతం పెట్రోలు నింపకుండా నిలిపివేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోలు బంకుల నిర్వహణపై సైతం సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోందని, ప్రజలకు మాత్రం అవస్థలు తప్పడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇకనైనా పెట్రో ఉత్పత్తులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న వారిపై చర్యలు చేపట్టి ప్రజలకు పూర్తిస్థాయిలో సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని సర్వత్రా కోరుతున్నారు.


