మహిళా సాధికారతకు ఆద్యుడు జగన్‌ | - | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతకు ఆద్యుడు జగన్‌

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

మహిళా రిజర్వేషన్‌

బిల్లును స్వాగతిస్తున్నాం

మాజీ ఎంపీ చింతా అనురాధ

అల్లవరం: లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న మహిళా బిల్లును వైఎస్సార్‌ సీపీ స్వాగతిస్తోందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చింతా అనురాధ అన్నారు. మండలం మొగళ్లమూరులోని ఆమె నివాసంలో శనివారం మహిళా బిల్లుపై ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎన్నో అడ్డంకులు, అవాంతరాలను ఎదుర్కొని మహిళా బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చిందన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం చాలా అవసరమని, మహిళా సాధికారతకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనే ఆదర్శమన్నారు. ఆయన పాలనలో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందడుగు వేశారన్నారు. చట్టసభల్లో, క్యాబినేట్‌ మంత్రి పదవుల్లో మహిళలు ఉన్నత పదవులను పొందారని, స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించడంతో ఎక్కువ మంది ఉన్నత పదవులు అలంకరించారని గుర్తుచేశారు. ఐదేళ్ల కిందటే జగన్‌ మహిళా సాధికారితకు పెద్ద పీట వేశారని ఆమె అన్నారు. జెడ్పీ చైర్మన్లు 56 శాతం, జెడ్పీ వైస్‌ చైర్మన్లు 55 శాతం, వలంటీర్లు సైతం 53 శాతం మహిళలకే ఇచ్చారని తెలిపారు. సచివాలయ ఉద్యోగాల్లో కూడా 51 శాతం మహిళా ఉద్యోగులకే కేటాయించారని అన్నారు. మహిళా ఆర్థిక స్వావలంబన దిశగా అమ్మఒడి, వైఎస్సార్‌ చేయూత తదితర పథకాలు అమలు చేసి జగన్‌ మహిళా పక్షపాతిగా నిలిచారన్నారు. ప్రధాని మోదీ కంటే ముందుగానే మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత జగదే అన్నారు. మాటల్లో కాదు చేతల్లో చూపే దమ్మున్న మా నాయకుడు జగన్‌ అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా రాష్ట్ర కార్యదర్శి గుబ్బల రోజా రమణి, జెడ్పీటీసీ కొనుకు గౌతమి, మాజీ సర్పంచ్‌లు రాకాపు విజయలక్ష్మి, బర్రే సీతారత్నం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement