ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవాలి

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు ప్రభుత్వం గాలిలో కలిపేసిందని వైఎస్సార్‌ సీపీ ఎంప్లాయీస్‌, పెన్షనర్స్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నల్లమర్రు చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో పార్టీ ఎంప్లాయీస్‌, పెన్షనర్స్‌ విభాగం రీజనల్‌ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.30 వేల కోట్లు ఉండగా ఇప్పటివరకు కేవలం రూ.7,900 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. అవికూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని చెప్పారు. పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తుండడంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు.

పెండింగ్‌ డీఏలు ఎప్పుడిస్తారు?

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు డీఏలు పెండింగ్‌ పెట్టిందని, అవి ఎప్పుడు ఇస్తుందో చెప్పాలని, వాటికి వడ్డీ చెల్లిస్తుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం కార్పొరేట్‌ ఆసుపత్రులకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో హెల్త్‌ కార్డులు నిరుపయోగంగా మారిపోయాయన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించడం వల్ల సుమారు 250 మంది వరకు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకటో తేదీన ఎప్పుడైనా జీతం ఇచ్చావా..

తాను అధికారంలోకి వస్తే ఉద్యోగులకు, పెన్షనర్స్‌కు ఒకటో తేదీన జీతాలు ఇస్తానని చెప్పారు. ఈ 22 నెలల్లో ఎవరికై నా ఒకటో తేదీన జీతం ఇచ్చారా అని నిలదీశారు. ఈ ప్రభుత్వం వెంటనే పీఆర్సీ వేయాలని, ఉద్యోగులకు ఐఆర్‌, ఇవ్వాలన్నారు. సీపీఎస్‌ రద్దు కూడా జరగలేదని, ఎన్నికల ముందు పెన్షన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఆ ఊసే లేదన్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగులు పని ఒత్తిడి కారణంగా మరణిస్తున్నా ఈ ప్రభుత్వం ఒత్తిడి తగ్గించడం లేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని పార్టీ నాయకులను ఆయన కోరారు. వైఎస్సార్‌ సీపీ ఎంప్లాయీస్‌, పెన్షనర్స్‌ విభాగం రాష్ట్ర సెక్రటరీ శివారెడ్డి, జాయింట్‌ సెక్రటరీ చిలకమర్తి సాయి ప్రసాద్‌, ఉభయగోదావరి జిల్లాల కో ఆర్డినేటర్‌ లావణ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement