అమలాపురం రూరల్: ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చేనేత రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొందని రామచంద్రాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పిల్లి సూర్య ప్రకాష్ విమర్శించారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన చేనేత ఆత్మ గౌరవ దీక్షలో సూర్య ప్రకాష్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రానికి నేతన్నలు గర్వకారణమని వారి కష్టానికి తగిన గుర్తింపు, రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యతని అన్నారు. చేనేత కార్మికులకు ముడి సరుకు సబ్సిడీలు, మార్కెటింగ్ సదుపాయాలు, ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పప్పు దుర్గారమేష్, అల్లక రాజు, దొంతంసెట్టి సత్య ప్రకాష్, ముప్పన వీర్రాజు, ఉప్పు రాజు, నక్క విజయలక్ష్మి, పరమేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ దీక్షలో జిల్లా చేనేత సంఘాల నాయకులు, కార్మికులు, వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


