ముమ్మిడివరం: నిబంధనలు పాటించని ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణాధికారి (డీటీవో) దేవిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. ఆయన మంగళవారం అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. యానాం నుంచి హైదరాబాద్ వెళుతున్న 23 బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. అగ్ని ప్రమాద నిరోధక పరికరాలు, అత్యవసర ద్వారం, ప్రయాణికుల లగేజీలను పరిశీలించారు. అతివేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పట్టుపడితే డ్రైవర్‌కు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు క్షేమంగా బయటపడే మెళకువలను బస్సులో ప్రయాణికులకు వివరించారు. మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ సురేష్ కుమార్ పాల్గొన్నారు.
గృహోపకరణాల దగ్ధం
తాళ్లరేవు: కోరంగి పంచాయతీ సీతారామపురం గ్రామంలో మంగళవారం రాత్రి రెడ్డి నాగరాజు ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లోని వారంతా టీవీ చూస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీవీతో పాటు ఏసీ తదితర గృహోపకరణాలు కాలిపోయాయి. గమనించిన స్థానికులు వెంటనే మంటలను అదుపుచేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సుమారు రూ.లక్షకు పైగా ఆస్తినష్టం సంభవించిందని బాధితులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు వచ్చి ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు.
సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టా పంట కాలువల మూసివేత గడువు పెరిగింది. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం ఈ నెల 15వ తేదీ నాటికి మూడు డెల్టా పంట కాలువలను మూసివేయాల్సి ఉంది. అయితే డెల్టా శివారు ప్రాంతాల్లో వరి ఆయకట్టుకు ఇంకా నీరు అందించాల్సి ఉన్నందున గడువును ఏప్రిల్ 20వ తేదీ వరకు పెంచుతున్నట్టు జలవనరుల శాఖ అధికారులు అనధికారికంగా చెబుతున్నారు.
ఐదు రోజుల పెంపు
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కీలకమైన రబీ సాగుకు సంబంధించి డెల్టా కాలువల మూసివేత గడువును ప్రభుత్వం పెంచింది. మరో ఐదు రోజులు గడువు పెంచుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. శివారు ప్రాంతాలలో వరి చేలకు ఇంకా నీరు అందించాల్సి ఉంది. అలాగే మున్సిపాలిటీ, పంచాయతీలు, ఆర్‌డబ్ల్యూఎస్ తాగునీటి పథకాలకు నీరందించాల్సి ఉన్నందున గడువు పెంచేందుకే జలవనరుల శాఖ అధికారులు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, దీనిపై బుధవారం స్పష్టత వస్తోందని అధికారులు చెప్పారు. తూర్పు డెల్టాకు నీటి వినియోగం పెద్దగా అవసరం లేనందున 2,500 క్యూసెక్కులకు తగ్గించారు. మధ్య డెల్టాకు 1,600, పశ్చిమ డెల్టాకు 4 వేల క్యూసెక్కులు చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో 7,759 క్యూసెక్కులుగా ఉంది. దీనిలో సీలేరు నుంచి 4,074 క్యూసెక్కుల నీరు వస్తోంది.
వరి కోతలు
జిల్లాలో రబీ వరి కోతలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ముందుగా సాగు చేసిన ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం మండలాల్లో రైతులు కోతలు ఆరంభించారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం, రాయవరం, అనపర్తి, కొవ్వూరు, బిక్కవోలు ప్రాంతాల్లోనూ, కాకినాడ జిల్లా సామర్లకోటతో పాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పీబీసీ పరిధిలో ఇప్పుడిప్పుడే కోతలు మొదలయ్యాయి. డెల్టాలో శివారు వరి ఆయకట్టు పరిస్థితి చూస్తుంటే ఈ నెల 20 తర్వాత కూడా గడువు పెంచాల్సి ఉందని అంచనా. తూర్పు డెల్టా, పశ్చిమ డెల్టా పరిస్థితి ఎలా ఉన్నా మధ్య డెల్టా పరిధిలోని శివారు ప్రాంతాల కోసం మరోసారి గడువు పెంచక తప్పదని రైతులు చెబుతున్నారు. ఇక్కడ శివారు ప్రాంతాలైన ఉప్పలగుప్తం, అల్లవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం, మలికిపురం, సఖినేటిపల్లి, రాజోలు, అంబాజీపేట, పి.గన్నవరం వంటి ప్రాంతాలలో సాగు ఆలస్యమైనందున ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ సగానికి పైగా ఆయకట్టులో వరి చేలు పాలు పోసుకుని కంకులు గింజ తోడుకునే దశలో ఉండడం గమనార్హం.
128 టీఎంసీల పంపిణీ
ప్రస్తుత రబీలో ఏకంగా 128.847 టీఎంసీల నీటిని వినియోగించడం గమనార్హం. డిసెంబర్ 1న జిల్లాలో రబీ వరి సాగు షెడ్యూల్ మొదలైంది. ఎప్పటి వరకు అధికారులు లెక్కల ప్రకారం తూర్పు డెల్టాకు 38.288 టీఎంసీలు నీటిని అందించారు. మధ్య డెల్టాకు 22.625 టీఎంసీలు, పశ్చిమ డెల్టాకు 61.937 టీఎంసీలు నీరు విడుదల చేశారు. ఇంత పెద్ద ఎత్తున నీరు విడుదల చేసినప్పటికీ శివారు, మెరక రైతులకు నీటి ఇక్కట్లు తప్పలేదు. కోనసీమలో శివారు ప్రాంతాలైన ఉప్పలగుప్తం, అల్లవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం, మలికిపురం, సఖినేటిపల్లి, కాకినాడ జిల్లా కాజులూరు, తాళ్లరేవు, కరప, పీబీసీలో చానళ్లు, పంట బోదెల్లో నీరు అడుగంటడం, సకాలంలో నీరందక రైతులు మురుగునీటి కాలువలు, నీరు తక్కువగా ఉన్న పంట కాలువల నుంచి మోటార్లతో తోడుకుని పంటను రక్షించుకున్నారు.
లొల్ల లాకులు
ఫ కాలువల మూసివేత గడువు పెంపు
ఫ ఆయకట్టు రైతుల
నీటి అవస్థలు తీరినట్టే..
ఫ మూసివేత గడువు పెంచాలని
ముందే చెప్పిన ‘సాక్షి’
ఫ నేడు రానున్న స్పష్టత
మూడు డెల్టాల్లో..
మూడు డెల్టాలో కలిపి మొత్తం 8,96,533 ఎకరాల్లో రబీ వరి సాగు జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. దీనిలో తూర్పు డెల్టాలో 2,64,533 ఎకరాలు, మధ్య డెల్టాలో 1,72,000 ఎకరాలు, పశ్చిమ డెల్టాలో 4,60,000 ఎకరాల చొప్పున వరి ఆయకట్టు ఉందని అధికారుల లెక్క. కానీ వాస్తవంగా మూడు డెల్టాల్లో కలిపి 7.5 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరుగుతుందని అంచనా. 2010లో గోదావరికి నీటి ఎద్దడి ఏర్పడిన సమయంలో కేవలం 85 టీఎంసీలతో గోదావరి డెల్టాలో రవి పంటను పండించారు. అప్పటికన్నా ఇప్పుడు ఆయకట్టు మరింత తగ్గింది. అయినప్పటికీ 128 టీఎంసీలకు పైగా నీరు ఇచ్చినా ఎద్దడి తప్పలేదు.


