ఒడ్డుకు చేరుకుంటున్న వేట బోట్లు
సాక్షి, అమలాపురం: సముద్ర వేట నిలిచిపోనుంది. జిల్లాలో అంతర్వేది తీర్థాల మొండి నుంచి ఐ.పోలవరం భైరవపాలెం వరకు విస్తారంగా ఉన్న సముద్రతీరంలో వేట నిషేధం అమలు కానుంది. ఏప్రిల్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి మొదలయ్యే వేట నిషేధం జూన్ 14వ తేదీ వరకు కొనసాగనుంది. 61 రోజుల పాటు వేట నిషేధం అమలులో ఉండనుంది. వేట నిషేధం వల్ల ఉపాధి కోల్పోయే మత్స్యకారులకు ఇవ్వాల్సిన పరిహారం చెల్లింపులో చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఒక ఏడాదే పరిహారం ఇచ్చింది. అది కూడా లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించిన తర్వాతే అమలు చేసింది. తొలి ఏడాది ఎగ్గొట్టింది. ఈ ప్రభుత్వం తీరుతో వేటకు విరామం అంటేనే మత్స్యకారులు ఒడ్డున పడ్డ చేపల్లా అల్లాడిపోతున్నారు.
సముద్ర మత్స్య సంపదను కాపాడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండు నెలల పాటు చేపల వేటపై నిషేధం విధిస్తాయి. వేట నిషేధం వల్ల జిల్లాలో సుమారు 1,700కు పైగా బోట్లు నిలిచిపోనున్నాయి. వీటిపై పది మండలాలకు చెందిన మత్స్యకారులు ఆధారపడి జీవిస్తున్నారు. సఖినేటిపల్లి, మలికిపురం, మామిడికుదురు, ఆల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం, కె.గంగవరం, రామచంద్రపురం మండలాలకు చెందిన మత్స్యకారులు వేట మీద జీవనం సాగిస్తున్నారు. ఇలా వేట మీద ఆధారపడే మత్స్యకార కుటుంబాలు జిల్లాలో 19,426 ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం, అల్లవరం మండలం ఓడలరేవు, నక్కా రామేశ్వరం, మామిడికుదురు మండలం కరవాక, ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప, ఎస్.యానాం, కాట్రేనికోన మండలం చిర్రయానాం, బలుసుతిప్ప, కొత్తపాలెం, మొల్లేటిమొగ, భైరవపాలెం, గాడిమొగ గ్రామాలకు చెందిన మత్స్యకారులు సముద్ర వేటకు ఎక్కువగా వెళతారు. వీరితోపాటు అనకాపల్లి జిల్లా నక్కపల్లి నుంచి వచ్చే వలస మత్స్యకారులు ఇక్కడ నివాసముండి సముద్ర వేట సాగిస్తుంటారు.
చేపల పునరుత్పత్తి కోసం
చేపల పునరుత్పత్తి (గుడ్లు పొదిగి పిల్లలు తయారయ్యే సమయం) జరిగే సమయంలో వేట సాగిస్తే మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతుంది. చేపల పునరుత్పత్తికి ఇదే అదను. ఈ సమయంలో వేట జరిగితే గుడ్లతో ఉన్న చేపలు బలవుతాయి. గతంలో చేపల వేట అంగుళం, అర అంగుళం వలలతో సాగేది. చిన్న చేపలు తప్పించుకునేవి. కానీ ఇటీవల రింగు వలలు (సూక్ష్మ కన్నాలు ఉండే వల) వాడుతున్నారు. దీని వల్ల చిన్న చేప తప్పించుకునే అవకాశం ఉండడం లేదు. ఈ వలలను మత్స్యశాఖ నిషేధించినా ఎక్కువగా వీటినే వాడుతున్నారు. దీనివల్ల పర్యావరణానికి ముప్పు అంటున్నా వీడడం లేదు. చేపల పునరుత్పత్తి సమయంలో వేట నిషేధం ద్వారా మత్స్య సంపద పెరిగే అవకాశం ఉంటుందన్న నిపుణుల సూచనలతో మత్స్య క్రమబద్ధీకరణ చట్టాన్ని రూపొందించారు. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు వేట నిలిచిపోనుంది. గతంలో 45 రోజులు ఉండేది. ఈ సమయం కూడా సరిపోదని సముద్ర శాస్త్రవేత్తలు చెప్పడంతో ఇది కాస్తా 61 రోజులకు పెరిగింది. ఈ కారణంగానే ఈ రెండు నెలల పాటు వేటను ఆపేస్తున్నారు. ఈ సమయంలో మర బోట్లు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లరాదు. అయితే స్థానికంగా తెప్పల మీద వెళ్లి, అది కూడా తీరానికి కిలోమీటరు పరిధిలో వేటాడవచ్చు. అయితే జిల్లాలో గోదావరి నదీపాయలలో మాత్రం వేట కొనసాగుతోంది.
వేటపై నిఘా
నిషేధ సమయంలో వేట జరగకుండా పలు శాఖలు నిఘా పెడుతున్నాయి. కోస్టు గార్డు, మైరెన్, నేవీ, మత్స్యశాఖలతోపాటు స్థానిక పోలీసులు కూడా వేటను అడ్డుకుంటారు. దేశంలో కన్యాకుమారి నుంచి కోల్‌కతా వరకు ఇదే పరిస్థితి. జిల్లాలో సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం నుంచి ఐ.పోలవరం మండలం భైరవపాలెం వరకు మత్స్యకారులు సముద్ర వేటకు దూరంగా ఉండనున్నారు. నిషేధ సమయంలో ఎవరైనా చేపల వేట సాగిస్తే వారికి రూ.2,500 వరకు జరిమానా విధించడంతో పాటు బోట్లను సీజ్ చేస్తారు.
నేటి నుంచి వేట నిషేధం
ప్రాదేశిక సముద్ర జలాలలో చేపల వేట చేసే యాంత్రిక పడవలు, మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్ల ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపల వేటను 15వ తేదీ నుంచి జాన్ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు నిషేధిస్తున్నట్టు జిల్లా మత్స్యశాఖాధికారి సోమవారం ప్రకటనలో తెలిపారు. సముద్ర మత్స్య సంపద సుస్థిరతకు ఈ నిషేదం విధిస్తున్నామన్నారు. ఉల్లంఘిస్తే బోట్లను, మత్స్య సంపదను స్వాధీనం చేసుకుని జరిమానా విధిస్తామన్నారు. డీజిల్ ఆయిల్ రాయితీ, వేట నిషేధ భృతి, ప్రభుత్వం అందించే అన్ని రాయితీ సౌకర్యాలు నిలుపుదల చేస్తామన్నారు.
రెండు నెలల పాటు ఇలాగే..
జిల్లాలో నేటి అర్ధరాత్రి నుంచి
వేటకు విరామం
61 రోజుల పాటు నిలిచిపోనున్న సముద్ర వేట
45 గ్రామాల్లో మత్స్యకారులు
సుమారు 1,700కు పైగా వేట బోట్లు
సముద్ర వేటపై ఆధారపడి సుమారు 19,426 కుటుంబాలు
తొలి ఏడాది మత్స్యకార భరోసాకు
చంద్రబాబు సర్కారు ఎగనామం
తొలి ఏడాది పరిహారం బాకీ
వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులకు పరిహారం అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. 2014– 19 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఒక్కొక్కరికీ రూ.3 వేల చొప్పున పరిహారం అందించేవారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు ఏటా క్రమం తప్పకుండా ఐదేళ్లపాటు వేట నిషేధం వల్ల నష్టపోయిన ప్రతి మత్స్యకారునికి రూ.10 వేల చొప్పున పరిహారం అందించారు. ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు ఏటా క్రమం తప్పకుండా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దీనిని పక్కాగా అమలు చేశారు. తాము అధికారంలోకి వస్తే వేట నిషేధం వల్ల నష్టపోయిన ప్రతి మత్స్యకారునికి రూ.20 వేల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది పరిహారాన్ని విజయవంతంగా ఎగ్గొట్టారు. ఎన్నికల ముందు కూటమి కట్టిన చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మత్స్యకారులను ఆకట్టుకునేందుకు రూ.20 వేల పరిహారం ఇస్తామన్నారు. ఇంతా చేసి ఒక ఏడాది మాత్రమే దీనిని అమలు చేశారు. జిల్లాలో 19 వేల మందికి పైగా మత్స్యకారులు ఉండగా గత ఏడాది కేవలం 11,300 మందికి మాత్రమే పరిహారం అందించి చేతులు దులుపుకున్నారు. ఈ ఏడాది అయినా అర్హులందరికీ రూ.20 వేల చొప్పున పరిహారం అందించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.


