రైతుకు అమృత భాండం | - | Sakshi
Sakshi News home page

రైతుకు అమృత భాండం

Apr 14 2026 7:46 AM | Updated on Apr 14 2026 7:46 AM

సాక్షి, అమలాపురం: ఆరోగ్యానికి ఔషధంగా పేరొందిన కొబ్బరి బొండాల సీజన్‌ మొదలైంది. గోదావరి జిల్లాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పలు ప్రాంతాలకు కొబ్బరి బొండాల ఎగుమతి జరుగుతోంది. మండుతున్న ఎండలు కొబ్బరి బొండాలకు గిరాకీ తెచ్చిపెట్టాయి. గత నెలలో కొబ్బరి బొండాం ధర రైతు వారీ రూ.13 నుంచి రూ.15 వరకు ఉండగా, ఇప్పుడది రూ.17 నుంచి రూ.25 వరకు పెరిగింది. ఈ పెరుగుదల రైతులకు కొంత ఊరట కల్పించింది. ఇక్కడి నుంచి ఎగుమతి అవుతున్న బొండాలకు హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి వంటి పెద్ద నగరాల్లో రిటైల్‌గా రూ.40 నుంచి రూ.60 వరకు ధర పలుకుతోంది. లీటరు బొండాం నీళ్లు రూ.120 వరకు విక్రయిస్తున్నారు.

కొబ్బరి కాయలకు గిరాకీ

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 1.80 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోందని అంచనా. ప్రధానంగా ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో పెదవేగి, విజయరాయి, జంగారెడ్డిగూడెం, నలజర్ల, కొవ్వూరు, చాగల్లు పరిసర ప్రాంతాల నుంచి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, కాకినాడ జిల్లా ఏలేశ్వరం పరిసర ప్రాంతాల నుంచి బొండాల ఎగుమతి అధికంగా ఉంటోంది. కోనసీమ జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉన్నా ఇక్కడి రైతుల నుంచి బొండాల సేకరణ తక్కువ. ఈ సీజన్‌లో ఆయా జిల్లాల నుంచి రోజుకు 50 నుంచి 70 ఐసర్‌ వాహనాలు, లారీల్లో బొండాలు ఎగుమతి అవుతాయని అంచనా. బొండాం ధర పెరగడంతో కొబ్బరి కాయకు సైతం డిమాండ్‌ ఏర్పడింది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో నిన్న మొన్నటి వరకు వేయి పచ్చి కొబ్బరికాయల ధర రూ.13 వేల వరకు ఉండగా, అది ఇప్పుడు రూ.15 వేలకు పెరిగింది.

భారీ వ్యత్యాసం

ఈ సీజన్‌లో ఈ ఏడాది కొబ్బరి దిగుబడి తగ్గింది. ఈ నేపథ్యంలో వేసవిలో కొబ్బరి బొండానికి మరింత డిమాండ్‌ రావాల్సి ఉంది. కానీ కొబ్బరి బొండాల సైజు తగ్గడం వల్ల అనుకున్న స్థాయిలో ధర రావడం లేదు. ‘కొబ్బరి బొండాలను రైతుల వద్ద కొనుగోలు చేసిన సమయంలో ఈ స్థాయిలో ధర వ్యత్యాసం ఉండేది కాదు. సైజును బట్టి రూ.2, రూ.3 మాత్రమే తేడా ఉండేది. ఇప్పుడు బాగా చిన్న సైజు వస్తోందని రూ.15 చేసి కూడా కొంటున్నారు. బాగా పెద్ద సైజు ఉందని కొన్నిచోట్ల రూ.28 పెట్టి కూడా కొంటున్నారు’ అని ఏలూరుకు చెందిన రైతు కె.చంద్రరావు ‘సాక్షి’కి తెలిపారు. పాత తోటల్లో (15 ఏళ్లకు పైబడి వయస్సు) ఉన్న తోటల్లో బొండాల కన్నా మొక్క తోట (15 ఏళ్ల లోపు వయసు) ఉన్న తోటల్లో బొండాలకు డిమాండ్‌ రావడానికి సైజు ప్రధాన కారణం.

ఇతర రాష్ట్రాల సరకు దిగుమతితో..

రూగోస్‌ వైట్‌ ఫ్‌లై (తెల్ల దోమ) వచ్చిన తరువాత కొబ్బరి తోటల్లో కాయ సైజుపై ప్రభావం చూపింది. 30 శాతం దిగుబడి తగ్గడంతో పాటు కాయ సైజు తగ్గడం కూడా పెద్దగా డిమాండ్‌ రాకపోవడానికి ఒక కారణమని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కొబ్బరి బొండాల కన్నా తమిళనాడు, కర్ణాటకల నుంచి పెద్ద సైజు బొండాలు రావడం కూడా ఇక్కడి బొండాలకు అనుకున్న స్థాయిలో డిమాండ్‌ రావడం లేదు. ఇది కూడా ధర ఆశించిన స్థాయిలో రాకపోవడానికి కారణమైంది. ‘మార్చి నుంచి జూన్‌ వరకు కొబ్బరి బొండాలకు అధిక డిమాండ్‌ ఉంటుంది. ఈ సమయంలో బొండాల కోత ఎక్కువగా ఉంటే ఆగస్టు నుంచి నవంబర్‌ వరకు కొబ్బరికి మంచి డిమాండ్‌ వస్తుంది’ అని రైతులు అంచనా వేస్తున్నారు.

పెరిగిన కొబ్బరి బొండాల రేట్లు

మొదలైన సీజన్‌

రైతు వారీ ధర రూ.17 నుంచి

రూ.25 వరకు

కొబ్బరి ధరలకు ఊతం

సైజు తగ్గడం వల్ల ఆశించిన

స్థాయిలో లేని డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement