అమలాపురం రూరల్: రహదారుల పక్కన స్థలాలు ఆక్రమించి షాపులు నిర్మించుకుంటున్నారని వాటిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమలాపురం బస్టాండ్, హాస్పిటల్స్, పార్కులు, గ్రంథాలయాలు, పలు ముఖ్య కూడళ్లలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని స్థానిక అధికారికి తెలియజేస్తే తాను ఈ ఊరు వ్యక్తిని కానంటూ సమాధానం చెప్పటం శోచనీయంగా ఉందని ఎమ్మెల్సీ అన్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి అక్రమణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్రమణలపై ప్రభుత్వం హైట్రా చట్టం తెచ్చి తొలగించాలని డిమాండ్ చేశారు.
పీజీఆర్‌ఎస్‌లో 212 అర్జీలు
అమలాపురం రూరల్: కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమంలో 212 అర్జీలను స్వీకరించారు. ఆర్డీవో మమ్మీ డీఆర్‌డీఏ పీడీ డి.రాంబాబు, డీఎల్‌డీవోలు రాజేశ్వరరావు, విజయలక్ష్మి పీజీఆర్‌ఎస్ నిర్వహించారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 24 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 24 అర్జీలు వచ్చాయి. ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్ ఎస్పీ కార్యాలయంలో తమ చాంబర్ల నుంచి పోలీస్ గ్రీవెన్స్‌ను నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రదేశాల నుంచి అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి వచ్చి అర్జీలు అందించారు. అర్జీల్లో సగానికి పైగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించినవే ఉండడంతో ఫిర్యాదిదారులను కౌన్సిలింగ్ చేసి వారి వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు చేశారు.
8 నెలలుగా పనుల్లేవ్
మహిళా ఉపాధి కూలీల నిరసన
అమలాపురం రూరల్: ఉప్పలగుప్తం పంచాయతీ పరిధిలోని ఆదిలక్ష్మిపురంలో ఎనిమిది నెలలుగా పనులు కల్పించలేదని మహిళా ఉపాధి కూలీలు కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. పనులు లేక కుటుంబ పోషణ కష్టంగా మారిందని అయితాబత్తుల వెంకటలక్ష్మి, జనిపల్లి అంజమ్మ ఆధ్వర్యంలో 35 కుటుంబాల వారు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. తమ పంచాయతీ పరిధిలోనే ఫీల్డ్ అసిస్టెంట్ కడిమి అరుణ పనులు కల్పించడంలేదని చెప్పారు. మండలంలో కొన్ని గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్నా కొన్ని గ్రామాల్లో జరగడం లేదన్నారు. పనులు కావాలని అడిగితే ఫీల్డ్ అసిస్టెంట్ ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం పనులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, అంచనాలు వేయడంలో సాంకేతిక ఇబ్బందులు ఏర్పడి ఆలస్యం జరుగుతోందన్నారు. దీనివల్ల వేసవి వచ్చినా ఇప్పటికీ చాలా గ్రామాల్లో పనులు ప్రారంభం కాలేదన్నారు. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే పనులు ముమ్మరంగా జరిగేవని, ఈ ఏడాది ఇంకా మొదలు కావడంలేదన్నారు. తక్షణం అన్ని గ్రామాల్లో జాబ్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం డ్వామా పీడీ రాంబాబు, సబ్ కలెక్టర్ మమ్మీలకు వినతిపత్రం అందించారు. పి. వెంకటలక్ష్మి, పెయ్యల వరలక్ష్మి, బళ్ల అరుణ, బూల అదిలక్ష్మి, పులిదిండి మంగ, పండు వరలక్ష్మి పాల్గొన్నారు.
అన్నవరం దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా చక్రధరరావు
ద్వారకా తిరుమల ఇన్‌చార్జిగా త్రినాథరావు బదిలీ
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి దేవస్థానం ఈఓ ఎన్‌ఎస్ చక్రధరరావు పూర్తి అదనపు బాధ్యతలతో నియమితులయ్యారు. ఈ మేరకు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.హరి జవహర్‌లాల్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. దేవదాయ శాఖ రాజమహేంద్రవరం ఆర్‌జేసీ వి.త్రినాథరావు నాలుగు నెలలుగా అన్నవరం దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా పని చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనను ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా నియమించారు. ఇన్‌చార్జి ఈఓగా నియమితులైన చక్రధరరావు బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు.


