ఆత్రేయపురం: ర్యాలి గ్రామంలోని జగన్మోహిని కేశవస్వామి దేవస్థానంలో శ్రవణ నక్షత్ర మాస కల్యాణాన్ని ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ చైర్మన్ మెర్ల నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు, ఆలయ ఈవో భాగవతల వెంకట రమణమూర్తి, సిబ్బంది తదితరులు పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు.
ఆన్‌లైన్ బెట్టింగ్‌లు
నిర్వహిస్తే కఠిన చర్యలు
అమలాపురం టౌన్: ఆన్‌లైన్ బెట్టింగ్‌లు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన అమలాపురంలో ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. క్రికెట్ మ్యాచ్‌లు, ఐపీఎల్, సోషల్ మీడియా చానళ్లు, టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ లింకులు, అనధికార యాప్‌ల ద్వారా అక్రమ బెట్టింగ్‌ల కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని, భారీ లాభాలు వస్తాయని ఆశ చూపిస్తూ, మోసపూరిత బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్లు నిర్వహిస్తున్నారన్నారు. అక్రమ బెట్టింగ్ చేసే వ్యక్తులకు భారీ జరిమానాలు, జైలు శిక్షలు తప్పవని హెచ్చరించారు. సైబర్ నేరం, మనీ లాండింగ్ కోణాల్లో వారిపై కేసులు నమోదు చేసి విచారిస్తామని తెలిపారు. ఆన్‌లైన్ రమ్మీ, క్యాష్ గేమింగ్, టెలిగ్రామ్ బెట్టింగ్ చానల్లు, అనుమానాస్పద యూపీఐ లావాదేవీల సమాచారం తెలిస్తే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు లేదా సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
పిల్లలను క్రీడల్లో
ప్రోత్సహించాలి
ఉప్పలగుప్తం: పిల్లలను తల్లిదండ్రులు చిన్నతనం నుంచే క్రీడల్లో ప్రోత్సహించాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు అన్నారు. ఉప్పలగుప్తం గ్రామానికి చెందిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి యనమదల ఇందిర ఇటీవల విజయనగరం జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 76 కేజీల విభాగంలో రెండో స్థానం సాధించి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రన్నర్‌గా నిలిచి, జాతీయ స్థాయికి ఎంపికై ంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఇందిరను ఆమె నివాసంలో వెంకన్నాయుడు సత్కరించి, నగదు బహుమతి అందజేశారు. అలాగే ఎస్‌టీయూ జిల్లా ఉపాధ్యాయవాణి కన్వీనర్ చిక్కం మైనర్ బాబు, మోటూరి సత్యంకాపు సైతం ఇందిరను అభినందించారు. వెంకన్నాయుడు మాట్లాడుతూ ఎనిమిదో తరగతి చదువుతున్న ఇందిర తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమె తండ్రి, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు యనమదల పల్లంరాజు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఆర్టీఐ విభాగం మండల అధ్యక్షుడు పోలిశెట్టి వీర్రాజు, పార్టీ నాయకులు బొర్రాయిపాలెపు సూర్యనారాయణ, దూలం సూరిబాబు, గొల్లపల్లి బాబీ, యర్రంశెట్టి ప్రసాద్, ఆప్పారి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
లోవ దేవస్థానంలో రద్దీ
తుని రూరల్: తలుపులమ్మ లోవ దేవస్థానానికి ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో 20 వేల మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్టు ఈఓ పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,62,195, పూజా టికెట్లకు రూ.1,57,020, కేశఖండన శాలకు రూ.12,160, వాహన పూజలకు రూ.9,500, కాటేజీలు తదితర వాటిద్వారా రూ.4,84,163 ఆదాయం లభించినట్టు ఆయన తెలిపారు.


