● చేనేత కార్మికుల ఆవేదన
● లివరీ దుప్పట్ల పేరుతో
చంద్రబాబు ప్రభుత్వం దెబ్బ
● నేసిన తర్వాత కొనని వైనం
రామచంద్రపురం రూరల్: రాష్ట్రంలో చేనేత కార్మికులు ‘చంద్రబాబు మార్కు వెన్నుపోటు’ దెబ్బతో విలవిల్లాడుతున్నారు. అసలే పని లేక కాఫీ హోటళ్లలో సర్వర్లుగా, పలు షాపుల్లో కూలీలుగా మారుతున్న చేనేత కార్మికులను తెలుగుదేశం ప్రభుత్వం ఊరించి ఉసూరుమనిపించింది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో లివరీ దుప్పట్లు ఉత్పత్తి చేసే చేనేత సహకార సంఘాలు శ్రీకాకుళం డివిజన్‌లో 6, విజయనగరం డివిజన్‌లో 3, రాజమహేంద్రవరం డివిజన్‌లో 10, విజయవాడ డివిజన్‌లో 4 వెరసి మొత్తం 23 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు ప్రభుత్వం గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 8 నెలల కాలంలో 2,52,000 లివరీ దుప్పట్లు ఉత్పత్తి చేయాలని ఆర్డరు ఇచ్చింది.
ఆర్డర్ ఇచ్చి..
లివరీ గైడ్‌లైన్స్ ప్రకారం చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం 50 శాతం సొమ్ము అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉండగా.. ఆర్డరు ఇచ్చి చేతుల దులుపుకొన్నారు. అయితే హాస్టల్ విద్యార్థులకు చేనేత సంఘాలు ఉత్పత్తి చేసిన దుప్పట్లు పంపిణీ చేయడం రివాజుగా జరుతున్న క్రమంలో.. సంఘాలు బ్యాంకులలో అప్పులు చేసి మరీ ఉత్పత్తి చేపట్టాయి. మూడు నెలల పాటు నేసిన దుప్పట్లు ఆప్కో ద్వారా ప్రభుత్వం తీసుకుంది. మరో 4 నెలలు నేసినవి సంఘాల వద్దే నిల్వలుగా పేరుకుపోయాయి. అడ్వాన్స్ మాట ఎలా ఉన్నా కనీసం కొనుగోలు చేసిన వాటికై నా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తే కాస్త ఒడ్డున పడదామని నేతన్నలు ఎదురు చూస్తున్నారు.
ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు
చేనేత సంఘాల వద్ద కొనుగోలు చేసిన దుప్పట్లను ఆప్కో వద్దనే ఉంచుకుని ప్రైవేటు వ్యక్తుల వద్ద ప్రభుత్వం మెషీన్ మేడ్ దుప్పట్లు కొనుగోలు చేసి హాస్టల్ విద్యార్థులకు పంపిణీ చేయడంతో చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సంఘాల్లో పేరుకున్న దుప్పట్ల నిల్వలను చూస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం 2024 డిసెంబర్ నుంచి 17 నెలలుగా చేనేత సంఘాలకు ఉన్న బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. చేనేత సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన లివరీ ఉత్పత్తుల బకాయిలు సుమారు రూ. 3.70 కోట్లు, అదే విధంగా చేనేత సంఘాల వద్ద ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చి కొనకపోవడంతో నిల్వ ఉన్న లివరీ బెడ్ షీట్లు సుమారు 43,980. లివరీ ఉత్పత్తులు కాకుండా చీరలు వంటి జనరల్ ఉత్పత్తుల నిమిత్తం కూడా ప్రభుత్వం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సుమారు 2.55 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని చేనేత నాయకులు చెబుతున్నారు.
నేటి నుంచి దీక్షలు
తెలుగుదేశం ప్రభుత్వం చేనేతలపై చూపుతున్న నిర్లక్ష్య ధోరణిపై కాకినాడ కలెక్టరేట్ వద్ద సోమవారం నుంచి ఉదయం 9 గంటల నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం. చేనేత కార్మికులు చేస్తున్న ఈ న్యాయ పోరాటానికి మద్దతు ఇవ్వాలని అన్ని ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులను కోరుతున్నాం.
– అల్లక రాజు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల చేనేత సహకార సంఘాల జేఏసీ కన్వీనర్


