భక్తులతో కిటకిటలాడిన అయినవిల్లి | - | Sakshi
Sakshi News home page

భక్తులతో కిటకిటలాడిన అయినవిల్లి

Apr 13 2026 7:20 AM | Updated on Apr 13 2026 7:20 AM

అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి (సురేష్‌) ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపారు. స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకదశ రుద్రాభిషేకాల్లో 46 మంది పాల్గొన్నారు. 26 మంది భక్తులు శ్రీలక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఎనిమిది మంది చిన్నారులకు అక్షరభ్యాసం, తొమ్మిది మంది పిల్లలకు తులాభారం వేశారు. 2,664 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.4,87,185 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్‌ కమిషనర్‌, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

చదువు భయంతో

బాలుడి అదృశ్యం

ఆచూకీ నాలుగు గంటల్లోనే లభ్యం

అమలాపురం టౌన్‌: చదువు భయంతో ఓ బాలుడు ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. నాలుగు గంటల్లోనే పోలీసులు అతడి ఆచూకీ తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అమలాపురంలోని దుడ్డి వారి అగ్రహారానికి చెందిన కాజా సురేష్‌ కుమారుడు అశ్విన్‌ స్థానికంగా ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం బయటకు వెళ్లిన అశ్విన్‌ ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అతడి గదిని పరిశీలించారు. అక్కడ అశ్విన్‌ రాసిన ఓ లేఖ లభ్యమైంది. చదువు తనకు ఇబ్బందిగా మారిందని, పదో తరగతి కూడా పాస్‌ కాలేననే భయంతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను అని దానిలో రాశాడు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పాడి బాలుడి ఆచూకీ కోసం ప్రయత్నించారు. అమలాపురంలో సీసీ పుటేజీలు పరిశీలించగా అశ్విన్‌ అమలాపురం బస్‌ స్టేషన్‌లో విజయవాడ బస్సు ఎక్కినట్లు గుర్తించారు. పోలీసులు ఆ బస్సును వెంబడించే లోపు బాలుడు మరో చోట దిగిపోవడంతో కేసు మలుపు తిరిగింది. దీంతో బాలుడి ఫొటోను సంబంధిత నెట్‌వర్క్‌ ఏరియాలకు పంపించారు. విజయవాడ పోలీస్‌ సెంట్రల్‌ కార్యాలయం నుంచి అందిన సమాచారం ఆధారంగా ఆశ్విన్‌ ప్రదేశాన్ని పోలీసులు నిమిషాల్లో గుర్తించారు. వెనువెంటనే స్పందించిన పోలీసులు విజయవాడలో బాలుడిని అదుపులోకి తీసుకున్నారని పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు.

నేడు యథాతథంగా పీజీఆర్‌ఎస్‌

అమలాపురం రూరల్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్‌ఎస్‌ను సోమవారం ఉదయం పది గంటల నుంచి యథాతథంగా నిర్వహిస్తామని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ తెలిపారు. కలెక్టరేట్‌ గోదావరి భవనంలో, డివిజన్‌, మండల కేంద్రాల్లో పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ యథావిధిగా జరుగుతాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement