● నాలుగు ఇళ్లు, స్టూడియోలో చోరీలు
● బంగారం, నగదు అపహరణ
● సీసీ టీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు
తాళ్లరేవు: మండల కేంద్రమైన తాళ్లరేవులో వరుస దొంగతనాలతో ప్రజలను భయబ్రాంతులకు గురవుతున్నారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట ప్రాంతంలో సంతపేట సెంటర్, బాలాజీ నగర్‌లలో దొంగలు హల్‌చల్ చేశారు. తాళం వేసి ఉన్న నాలుగు గృహాలు, ఒక స్టూడియో చొరబడి బంగారం, నగదు, కెమెరాలు అపహరించుకుపోయారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. చిన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం వెనుక గల ఇళ్లలో దొంగ చొరబడి సుమారు రూ.60 వేలు విలువ చేసే అరకాసు బంగారం, రూ.5 వేల నగదు, పక్కనే తాళం వేసిన ఉన్న మరో ఇంటిలోని రూ.15 వేలు నగదు అపహరించుకుపోయాడు. మరో ఇంటిలో కొన్ని వస్తువులు, 5 తులాల వెండి మాయమైనట్లు తెలిసింది. అలాగే సంతపేట సెంటర్‌లోని ఒక స్టూడియోలోకి చొరబడి రెండు కెమెరాలు, నగదు అపహరించుకుపోయారు. ఈ దొంగతనాలకు సంబంధించి పలు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ముఖానికి ఎటువంటి మాస్క్ కట్టుకోకుండా దర్జాగా వచ్చిన ఓ వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించారు. అయితే ఒకే వ్యక్తి ఐదు చోట్ల దొంగతనాలకు పాల్పడడం అసాధ్యమని, మరికొందరు ఉండి ఉండవచ్చని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోరంగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆధారాలు సేకరించి, సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.సత్యనారాయణ తెలిపారు.


