● జిల్లాలో మొదలైన రబీ వరి కోతలు
● ఈసారి 194 కేంద్రాలు మాత్రమే
● 1.31 లక్షల ఎకరాల్లో సాగు
● 4.43 లక్షల మెట్రిక్ టన్నుల
దిగుబడి వస్తుందని అంచనా
● గత రబీలో రైతులను
ముంచిన చంద్రబాబు ప్రభుత్వం
● నష్టపోయిన డెల్టా రైతులు
● ఈసారి ఏమవుతుందోనని ఆందోళన
సాక్షి, అమలాపురం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు వ్యవసాయం భారంగా మారింది. విత్తు నుంచి విక్రయం వరకూ అనేక ఇబ్బందులు పడి, ప్రకృతి వైపరీత్యాలకు ఎదురు నిలిచి పండించినా, విక్రయించడానికి అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోవడం, చేసినా సకాలంలో డబ్బులు జమ చేయకపోవడంతో ఏమి చేయాలో తెలియడం లేదు. గతేడాది రబీకి ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ రబీ సీజన్ కోతలు మొదలయ్యాయి. ధాన్యం విక్రయానికి ఎన్ని కష్టాలు పడాలోనని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈసారైనా ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.
అసలు పరీక్ష
గోదావరి డెల్టాలో రబీ వరి కోతలు మొదలవుతున్నాయి. ఆత్రేయపురం, ఆలమూరు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించింది. ఈ ఏడాది మండపేట నియోజకవర్గం మినహా మిగిలిన ఆరు నియోజకవర్గాల పరిధిలో (కాజులూరు, తాళ్లరేవు మండలాలు మినహా) 1,31,500 ఎకరాల్లో సాగు జరిగింది. సగటు దిగుబడి ఎకరాకు 45 బస్తాలు (75 కేజీలు) లెక్క వేస్తే సుమారు 4.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తుందని అంచనా. రబీలో శివారు, మెరక ప్రాంతాలకు సమృద్ధిగా సాగునీరు అందకున్నా, రైతులు అష్టకష్టాలు పడి పంట పండించారు. అయితే రైతులకు ఇప్పుడే అసలు పరీక్ష మొదలైంది. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల సంఖ్య తక్కువే. దీనికి తోడు మండపేటను తూర్పు గోదావరి జిల్లాలో కలవడంతో మిల్లులు సంఖ్య, అవి ధాన్యం సేకరించే సామరర్థ్యం కూడా తగ్గిపోయింది. ఈ కారణంగానే తమ వద్ద ధాన్యం పూర్తిస్థాయిలో ప్రభుత్వం సేకరిస్తుందనే నమ్మకం రైతులకు కలగడం లేదు.
గత రబీలో రైతులను ముంచేశారు
గత రబీలో ధాన్యం కొనుగోలులో చంద్రబాబు ప్రభుత్వం నిర్లిప్తత, సకాలంలో సొమ్ములు చెల్లించడంలో నిర్లక్ష్యంతో రైతులు నిలువునా మునిగిపోయారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలలో ధాన్యం కొనుగోలు జరిగింది. మండపేట నియోజకవర్గంతో కలిపి జిల్లాలో 334 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 1.68 లక్షల ఎకరాలలో రబీ వరిసాగు జరగగా, సుమారు 5.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిగా వచ్చింది. భారీగా దిగుబడి వచ్చినా ప్రభుత్వం తొలుత రెండు లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పింది. తర్వాత రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని మరో లక్ష మెట్రిక్ టన్నులకు పెంచారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొన్ని కేంద్రాలలో లక్ష్యం పూర్తయ్యిందని కొనుగోలు చేయకపోవడంతో రైతులు మిల్లర్లకే అయిన ధరకు ధాన్యం అమ్మకాలు చేయాల్సి వచ్చింది. అప్పట్లో కనీస మద్దతు ధర 75 కేజీల ఽబస్తాకు రూ.1,725 వరకు ఉండగా రూ.150 నుంచి రూ.200లు తగ్గించి రైతులు అమ్మకాలు చేసుకున్నారు. దీని వల్ల రబీ పండినా రైతులు లాభాలు పొందలేకపోయారు.
చంద్రబాబు గొప్పలు
ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో సొమ్ములను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పలకు పోయింది. తొలి వారం పది రోజులు 24 గంటల నుంచి 48 గంటలకు సొమ్ములు చెల్లించారు. తరువాత నెలల తరబడి సొమ్ములు ఇవ్వకుండా రైతులను ముప్పుతిప్పలు పెట్టారు. మే 9వ తేదీ నుంచి ధాన్యం సొమ్ములు చెల్లింపులు నిలిపివేయడంతో రైతులు అష్టకష్టాలు పడ్డారు. కనీసం ఖరీఫ్ సాగు ప్రారంభమైన జూన్ 1వ తేదీకి సైతం ధాన్యం సొమ్ములు వేయకపోవడంతో రైతులు అప్పులు చేసి సాగు చేయలేక పలు ప్రాంతాల్లో ఖరీఫ్‌కు దూరమయ్యారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆ పరిస్థితి రాకుండా చూడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. రైతులు అమ్మకాలు చేయాలనుకున్న మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు సకాలంలో సొమ్ములు చెల్లించాలని వారు కోరుతున్నారు.


