దేవీపట్నం: గడిచిన రెండు వారాలుగా దేవీపట్నం మండలంలోనే తిష్ట వేసిన పెద్ద పులి ఎట్టకేలకు గోదావరి దాటింది. దేవీపట్నం, లింగవరం గ్రామాల వద్ద ఐదు రోజుల పాటు మకాం ఉండడంతో ఆ ప్రాంతంలోనే ఉంటుందని భావించినప్పటికీ పులి తన గమనాన్ని మార్చుకుంటోంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున దేవీపట్నం, లింగవరం గ్రామాల సమీపంలో గోదావరి నదిని దాటి ఏలూరు జిల్లా పోలవరం మండలం సంగనపల్లి ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పులికి అమర్చిన జీపీఎస్ ట్రాకర్ ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం కావడంతో దేవీపట్నం తరహాలోనే అక్కడ కూడా సమృద్ధిగా నీరు, పులికి ఆహారం లభించే అవకాశం ఉంది. అయినప్పటికీ పెద్ద పులి వచ్చిన ప్రాంతమైన మహారాష్ట్రలోని తడోబా అంధేరి అభయారణ్యానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏలూరి జిల్లా దాటుకుని తెలంగాణ రాష్ట్రం మీదుగా మహారాష్ట్రలోని తడోబా చేరుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం పులి ఉన్న ప్రాంతం నుంచి సుమారు 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి ఉంటుంది.
సీతారామ సత్రానికి
రూ.5 లక్షల విరాళం
అన్నవరం: రత్నగిరిపై నూతనంగా నిర్మించనున్న సీతారామ సత్రంలో ఒక గది నిర్మాణానికి కర్నూలుకు చెందిన ఎల్.రవీంద్రారెడ్డి దంపతులు రూ. ఐదు లక్షల విరాళాన్ని శనివారం ప్రకటించారు. రూ. 11.40 కోట్లు వ్యయంతో 105 గదులతో నిర్మించనున్న సత్రానికి ఆదివారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కాగా శనివారం దాత రవీంద్రారెడ్డి సత్యదేవుని దర్శించి పూజల అనంతరం ఆయన ప్రకటించిన విరాళంలో తొలి విడత రూ.2.6 లక్షల చెక్కును దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వి.రామకృష్ణకు అందజేశారు. డోనార్ స్కీం కింద సత్రంలో 15వ నంబరు గదిని దాతకు కేటాయించనున్నట్టు ఈఈ తెలిపారు.


