
అంబేద్కర్ నడయాడిన ఈలి వాడపల్లి
నేటికి 81 ఏళ్లు పూర్తి
రామచంద్రపురం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రామచంద్రపురంలో పర్యటించి నేటికి 81 ఏళ్లు పూర్తయ్యింది. 1944 సెప్టెంబర్ 28న ఆయన స్థానిక ఈలి వాడపల్లి ఆశ్రమానికి వచ్చారు. తాళ్లరేవు మాజీ ఎమ్మెల్యే, దళిత నాయకుడు ఈలి వాడపల్లి 1944లో అంబేడ్కర్‌ను జిల్లా ప్రజలకు పరిచయం చేసేందుకు జాతికి నూతన చైతన్యాన్ని, స్ఫూర్తిని కలిగించేందుకు జిల్లాకు ఆహ్వానించారు. ఆ మేరకు ఆయన కాకినాడ రాగా అక్కడ ఏనుగుపై ఆయనను కూర్చుండబెట్టి వేలాది దళితులు, పుర ప్రముఖుల సమక్షంలో ఊరేగించారు. అనంతరం వాడపల్లి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయనకు కుయ్యేరు గ్రామానికి చెందిన దండంగి గంగమ్మ స్వాగతం పలికారు. రామచంద్రపురంలో వంద ఎడ్ల బండ్లను అలంకరించి గారడీలు, డప్పుల బ్యాండ్‌లు, కోలాటాలతో టాప్ లేని కారు మీద అంబేడ్కర్‌ను ఘనంగా ఊరేగింపుగా వాడపల్లి ఆశ్రమానికి వచ్చారు. అక్కడ దళిత విద్యార్థుల చదువు, పోషణ తదితర వివరాలను అడిగి తెలుసుకుని వాడపల్లిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన వాడపల్లి పెద్ద కుమారునికి ప్రేమప్రసాద్ అనే నామకరణం చేశారు. అనంతరం ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు.
ఆయన స్మారకంగా తపాలా కవరు
అంబేడ్కర్ రామచంద్రపురం పర్యటనను పురస్కరించుకుని తపాలా శాఖ 2021 సెప్టెంబర్‌లో ప్రత్యేక తపాలా కవర్‌ను విడుదల చేసింది. దీనిని అప్పటి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీని వాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో విడుదల చేశారు.

అంబేద్కర్ నడయాడిన ఈలి వాడపల్లి