
ఈ ఘటనలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పండి
శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు
హాస్టళ్లలో మృతులపై విచారణ, చర్యల గురించి ప్రభుత్వం చెప్పడంలేదు..
‘నవయుగ’కు గిరిజన భూముల జీఓను రద్దుచేయాలి
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఆందోళనను పట్టించుకోరా?
‘మండలి’లో వైఎస్సార్‌సీపీ సభ్యుల ‘ప్రత్యేక’ ప్రస్తావన
సాక్షి, అమరావతి: ‘గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురై చనిపోతున్నారు. కొంతమంది ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ఇది చాలా దారుణం. ఈ ఘటనలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలియజేయాలి. అంతేకాదు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలి’.. అని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావన కింద సభ్యుడు అనంత ఉదయభాస్కర్ ఈ అంశంపై మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని గిరిజన హాస్టళ్లలో గడిచిన ఏడు నెలల్లో నలుగురు విద్యార్థులు మృతిచెందారని సభ దృష్టికి తీసుకొచ్చారు.
ఈ దుర్ఘటనలపై రంపచోడవరం ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, బాధ్యులైన వారిని సస్పెండ్‌చేసి సమగ్ర విచారణ చేపడతామని చెప్పారన్నారు. విచారణ చేపట్టారో లేదో.. బాధ్యులపై చర్యలు తీసుకున్నారో లేదో కూడా చెప్పడంలేదని అన్నారు. ఈ మరణాలకు కారణాలేమిటో తెలియజేయడంతో పాటు విచారణ జరిపితే ఆ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలన్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందిస్తూ.. తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రత్యేక ప్రస్తావన కింద ‘మండలి’లో చివరి రోజైన శనివారం ఇతర సభ్యులు ప్రస్తావించిన అంశాలు..
‘నవయుగ’కు గిరిజన భూములెలా ఇస్తారు?
గిరిజనుల హక్కులను కాలరాస్తూ వారి భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా కేటాయిస్తారు? అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం టోకూరు, పెదవడ్డ, బూర్జా ప్రాంతాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టులను నవయుగ అనే ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. ఇందుకోసం జీఓ–51ను జారీచేసింది. ఇది ముమ్మాటికి 1/70 చట్టాన్ని ఉల్లంఘించడమే. తక్షణమే ఆ జీఓ–51ను రద్దుచేయాలి. – కుంభా రవిబాబు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ
తక్షణమే జీఓ–5ను రద్దుచేయాలి..
దొమ్మరి కులం పేరును దొమ్మిరి గిరిబలిజగా మారుస్తూ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జారీచేసిన జీఓ–5ను తక్షణమే రద్దుచేయాలి. దొమ్మరి కుల ప్రస్తావనతో తాము తీవ్ర వివక్షకు గురవుతున్నందున ఆ పేరు పూర్తిగా మాసిపోయేలా తమ సామాజికవర్గానికి కొత్తపేరు పెట్టాలని వారు కోరారు. కానీ, తిరిగి అదే పేరును కొనసాగిస్తూ బ్రాకెట్‌లో గిరిబలిజగా పేర్కొనడం సరికాదు. తక్షణమే ఈ జీఓను రద్దుచేయాలి. – వంకా రవీంద్రనాథ్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ
లక్ష మంది రోడ్డెక్కితే పట్టించుకోరా?
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లక్ష మందికి పైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వలంటీర్ల వ్యవస్థను రద్దుచేసి ఆ పనిభారాన్ని వారిపై మోపారు. తమ డిమాండ్ల సాధన కోసం వారు నిరసనలు, ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. తక్షణమే సచివాలయ ఉద్యోగులతో చర్చలు జరిపి, ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించాలి. – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ
పోలీసులకు పదోన్నతులు కలి్పంచాలి..
పోలీసు శాఖలో కానిస్టేబుల్ నుంచి ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు ఏళ్ల తరబడి పదోన్నతులు లేకుండా ఇబ్బందిపడుతున్నారు. చాలామంది ఇన్‌స్పెక్టర్లు ఒక్క ప్రమోషన్ మాత్రమే తీసుకుని రిటైర్ అవుతున్నారు. తక్షణమే వారికి పదోన్నతులు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థల రక్షణకు ఏర్పాటుచేసే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నియామకాలు ఏపీలోనే చేపడితే కొత్త పోస్టులు, ప్రమోషన్ ఛానల్స్ పెరుగుతాయి. – ఏసురత్నం, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ
ఎంపీటీసీలు, జెడ్పీటీసీల బకాయిలు చెల్లించాలి..
రాష్ట్రంలో 13 వేల మంది ఎంపీటీసీలకు రూ.100.30 కోట్లు, 660 జెడ్పీటీసీలకు రూ.9.50 కోట్ల మేర గౌరవ వేతన బకాయిలున్నాయి. వాటిని వెంటనే చెల్లించాలి.
– బొమ్మి ఇజ్రాయెల్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ
విశాఖలో వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలి..
విశాఖపట్నంలో మూడువేలకు పైగా వీధి వ్యాపారుల షాపులను జీవీఎంసీ అధికారులు తొలగించారు. వీరితోపాటు వారి వద్ద పనిచేసే వేలాది మంది రోడ్డునపడ్డారు. సుందరీకరణ, ట్రాఫిక్ పేరిట తొలగించడం సరికాదు. వారికి ప్రత్యామ్నాయం చూపాలి. – సూర్యనారాయణరాజు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ
‘హైస్కూల్ ప్లస్’లలో ఖాళీలను భర్తీచేయాలి..
హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో 1,572 పీజీటీ శాంక్షన్ పోస్టులుండగా, 800 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 772 పోస్టులు కాంట్రాక్టు లెక్చరర్లతో కాకుండా స్కూల్ అసిస్టెంట్లతో భర్తీచేయాలి. – కల్పలతారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ
‘ఒంటిమిట్ట’ పర్యాటక ప్రాజెక్టును పట్టాలెక్కించాలి..
వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో కోదండ రామాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా పడలేదు. తక్షణమే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలి. – రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ