
దసరాకి దినుసులెలా?
● ఆవేదన వ్యక్తం చేస్తున్న చిరుద్యోగులు
● రెండు నెలలుగా వేతన బకాయిలు
రామచంద్రపురం ఎంఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న సమగ్ర శిక్ష ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
అంగన్‌వాడీ ఉద్యోగుల ఆందోళన (ఫైల్)
సాక్షి, అమలాపురం: సూపర్ సిక్స్ పేరుతో అద్భుతాలు చేస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు అన్ని వర్గాలనూ మోసం చేస్తున్నారు. ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని, మెరుగైన పీఆర్సీ ప్రకటించి, బకాయిలన్నీ చెల్లిస్తామని ఎన్నికల హామీలు గుప్పించారు. పాలనా పగ్గాలు చేపట్టి 16 నెలలు కావస్తున్నా అవేమీ చేయకపోగా చిరుద్యోగులను మరీ దారిద్య్రంలోకి నెట్టేశారు. నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో దసరా పండగ నాడు కూడా వారు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది.
అంగన్‌వాడీ, ఆయాలకు రెండు నెలలుగా..
సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు రెండు నెలలుగా వేతనాలు బకాయి పెట్టారు. కార్యకర్తకు నెలకు రూ.11,500, ఆయాకు రూ.7వేలు గౌరవ వేతనంగా అందజేస్తారు. ఆ చిన్న మొత్తాన్ని సైతం జూలై, ఆగస్టు నెలలకు ఇవ్వలేదు. ఇంకో నాలుగు రోజులు గడిస్తే మూడో నెలా బకాయి పెట్టినట్టు అవుతుంది. జిల్లాలో 1,726 అంగన్‌వాడీ కేంద్రాల్లోని 1,637 మందికి కార్యకర్తలకు నెలకు రూ.1,88,25,500 చొప్పున, ఆయాలకు నెలకు రూ.1,14,59,000 చొప్పున మొత్తం రూ.3,02,84,500 గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. రెండు నెలలకు కలిపి రూ.6,05,69,000 ప్రభుత్వం బకాయి పెట్టింది.
సమగ్ర శిక్ష సిబ్బందికి..
విద్యా శాఖలో సమగ్ర శిక్ష అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆగస్టు నెల గౌరవ వేతనం సెప్టెంబరు నెల ముగస్తున్నా నేటి వరకు ఇవ్వలేదు. మరో నాలుగు రోజులు గడిస్తే రెండు నెలల వేతనాలు బకాయి పడతాయి. సమగ్ర శిక్షా పరిధిలో 22 మండలాల్లో వివిధ విభాగాల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో సీఆర్‌ఎంటీలు 117, పీటీఐలు 250, ఆఫీస్ సిబ్బంది 80, ఐఈఆర్‌పీలు 44, ఏపీసీవోఎస్‌లు 30, సైట్ ఇంజినీర్లు ఐదుగురు చొప్పున ఉన్నారు. సీఆర్‌ఎంటీకి నెలకు రూ.23,500 గౌరవ వేతనం చెల్లిస్తుండగా, పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు రూ.17,500 చెల్లిస్తున్నారు. పండగ దగ్గర చేసైనా చెల్లిస్తారా అని వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.
పండుగ పూటా పస్తులేనా
దసరా సరదా మాట దేవుడెరుగు. పూట గడవడమెలా అనే పరిస్థితి వారిది. నెల జీతం రాకపోతే ఇంటి ఖర్చులు, వైద్య ఖర్చులు తదితర చెల్లింపులు చేసుకోవాల్సి ఉంటుంది. అసలే అరకొర వేతనాలతో జీవితాలను నెట్టుకొస్తున్న అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు నెలవారీగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు.
ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలి
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు అసలే అరకొర వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. వేతనాలు సక్రమంగా అందకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకోవలసి వస్తోంది. ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలి.
– కె.కృష్ణవేణి, జిల్లా ప్రధాన కార్యదర్శి, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
ఇబ్బంది పడుతున్నాం
దసరా పండుగ వచ్చేసింది. వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబ పోషణకు రోజు వారీ ఖర్చులు, ఇతర అవసరాలకు అప్పులు చేయాల్సి వస్తోంది. దసరా పండగకై నా వేతనాలు చెల్లించాలి.
– సీహెచ్ వెంకన్నబాబు, జిల్లా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్

దసరాకి దినుసులెలా?

దసరాకి దినుసులెలా?

దసరాకి దినుసులెలా?