
ఎమ్మెల్యేలకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలి
బాలకృష్ణ వ్యాఖ్యలపై పితాని ధ్వజం
ముమ్మిడివరం: దేవాలయం లాంటి శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గు పడేలా ఉన్నాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బాలకృష్ణ మద్యం తాగి అసెంబ్లీకి వచ్చారా అనే సందేహం ప్రజలకు కలుగుతోందని అన్నారు. ఎందుకంటే ఆయన హావభావాలు, బాడీ లాంగ్వేజ్ చూసిన వారికెవరికై నా ఇటువంటి సందేహం కలుగుతుందన్నారు. ఇకపై అసెంబ్లీకి వచ్చే శాసన సభ్యులకు బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు చేయాలని పితాని హితవు పలికారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని అవమానించడం అంటే అయన అభిమానులను అవమానించడమేనన్నారు. తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి, చిరంజీవి, సినీ రంగ ప్రముఖుల మధ్య జరిగిన సమావేశం ఆహ్లాదకరంగా జరిగిందని, దీనివల్ల సినిమా రంగానికి ఎంతో మేలు జరిగిందని, నిర్మాతలు, లాభపడ్డారని గుర్తు చేశారు. బాలకృష్ణ నటించిన సినిమాకి కూడా టికెట్లు పెంచుకునేందుకు తమ నాయకుడు అవకాశం కల్పించారని ఆయన గుర్తు చేశారు. తన అన్నను శాసన సభ సాక్షిగా అవమానకరంగా మాట్లాడినా పవన్ కల్యాణ్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. జగన్‌కు బాలకృష్ణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పెయ్యల చిట్టిబాబు, మట్టపర్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు.