
వెదురు సాగు లాభదాయకం
రాజానగరం: వెదురును సాగు ద్వారా ఎకరానికి రూ.ఒక లక్ష ఆదాయాన్ని పొందవచ్చని సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీపీసీఆర్‌ఐ) విశ్రాంత సంచాలకుడు పి.చౌడప్ప అన్నారు. లాలాచెరువు సమీపంలోని ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించి, అక్కడ పెంచుతున్న వివిధ రకాల వెదురు జాతుల మొక్కలను పరిశీలించారు. వెదురు మొక్కలను బయోచార్ ప్రిపరేషన్, అగర్‌బత్తీల తయారీ వంటి విభిన్న రంగాలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారన్నారు. జిల్లా ఉద్యాన విభాగం అధికారి ఎన్.మల్లికార్జునరావు మాట్లాడుతూ వెదురు సాగు చేసే రైతులకు పలు రకాల సబ్సిడీలు ఉన్నాయన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించే పంటగా ఈ సాగు ఎంతో అనువైదని పేర్కొన్నారు. ఉద్యాన శాఖ అధికారి కొవ్వూరు సుధీర్, మండల శాఖ అధికారి నాగదేవి, వేణుమాధవ్, అటవీ శాఖ రేంజర్ డేవిడ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.