
ఇదేం ప్రవేషాలు
● డిగ్రీ అడ్మిషన్లపై గందరగోళం
● ఇప్పటికీ విడుదల కాని ప్రభుత్వ నోటిఫికేషన్
● ఆందోళన చెందుతున్న విద్యార్థులు
రాయవరం: విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోంది.. సరైన ప్రణాళిక లేకుండా సాగుతున్న వైనం విద్యార్థులను ఇబ్బంది పాల్జేస్తోంది.. దీనికి ఉదాహరణే డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ. ఈ కళాశాలల్లో చేరికలకు ఇప్పటి వరకూ అధికారికంగా ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం విద్యా వ్యవస్థను అయోమయంలో పడేస్తోంది. ఇంటర్ ఫలితాలు విడుదలై దాదాపు మూడు నెలలు దాటినా నేటికీ డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా జూలై మాసానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమై తరగతులు సైతం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇంత వరకూ ఆ ఊసే లేకుండా పోయింది. దీంతో వేలాది మంది విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. జిల్లాలో 2024–25 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 12,825 మందికిగాను 9,246 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరితోపాటు పలువురు సప్లిమెంటరీ రాసి పాసైన వారున్నారు. వీరంతా డిగ్రీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.
జిల్లాలో 53 కళాశాలలు
జిల్లాలోని మొత్తం 53 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలు డిగ్రీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఆయా కళాశాలలు బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీబీఏ వంటి కోర్సులను వివిధ కాంబినేషన్లతో డిగ్రీ విద్యను అందిస్తున్నాయి. గత విద్యా సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో సుమారు 10 వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నత విద్యపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది కూడా అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంగా చేపట్టడంతో చాలా కళాశాలల్లో 30 శాతం సీట్లు మిగిలిపోయాయి.
వీడని సందిగ్ధత
డిగ్రీ కోర్సులకు సంబంధించి సింగిల్, డబుల్ మేజర్ సబ్జెక్టుపై సందిగ్ధత కొనసాగుతోంది. జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వం నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే సింగిల్, డబుల్ మేజర్ సబ్జెక్టుతో నూతన డిగ్రీ కోర్సులను అందిస్తున్నారు. అయితే వీటిపై వస్తున్న సందిగ్ధతతో విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాలల యాజమాన్యాలు గందరగోళానికి గురవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత ఆలస్యంగా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితిపై ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు కూడా ఆందోళనలో ఉన్నారు.
తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలి
ఇంటర్ ఫలితాలు విడుదలై మాసాలు గడుస్తున్నా ప్రవేశాలు చేపట్టకపోవడంపై గందరగోళం నెలకొంది. డిగ్రీ కళాశాలలు పునః ప్రారంభమై నెలన్నర దాటింది. ఇంకా డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కాకపోవటం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. తక్షణమే డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలి.
– బి.సిద్ధూ, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పీడీఎస్‌యూ
ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి
డిగ్రీ అడ్మిషన్లపై నేటి వరకూ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దారుణం. డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గతేడాది ఆలస్యంగా నోటిఫికేషన్ ఇచ్చారనుకుంటే, ఈ ఏడాది మరింత జాప్యం చేశారు. డిగ్రీ అడ్మిషన్లపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి. ఇతర రాష్ట్రాల్లో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. రాష్ట్రంలో ప్రవేశాలు చేపట్టకపోవడం సరికాదు.
– మిందిగుదిటి శిరీష్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం, అమలాపురం

ఇదేం ప్రవేషాలు

ఇదేం ప్రవేషాలు