
రైతులు ఐక్యంగా సాగితే విజయం
అంబాజీపేట: రైతులు ఐక్యంగా సాగితే ఎందులోనైనా విజయం సాధించవచ్చని ఏపీ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ సభ్యుడు ముత్యాల జమ్మిలు, కోకో ఫెడ్ చైర్మన్ అరిగెల బలరామమూర్తి అన్నారు. స్థానిక సీ్త్రల ఆస్పత్రి సమీపంలోని కొర్లపాటి కోటబాబు వ్యవసాయ క్షేత్రంలో అంబాజీపేట రైతు సంఘం నాయకులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జమీలు, బలరామమూర్తి మాట్లాడుతూ కొంతకాలంగా వ్యవసాయ మోటార్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుండగా, కొన్ని మోటార్లకు బిల్లులు కట్టించుకునేవారన్నారు. దీనిపై రైతులు విద్యుత్ అధికారులు, ప్రజాప్రతినిధులకు వివరించినా ప్రయోజనం కలగలేదన్నారు. ఈ మేరకు రైతులు అందరితో కలసి ప్రత్యేక కోర్టులో కేసు వేయించామన్నారు. 16 మంది రైతులకు సుమారు రూ.3.20 లక్షల ప్రయోజనం కలిగేలా కోర్టు తీర్పు వచ్చిందన్నారు. రైతుల పక్షాన పోరాడి విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ముత్యాల జమీలు, అరిగెల బలరామూర్తిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కొర్లపాటి కోటబాబు, మట్టపర్తి పరమేశ్వరరావు, మట్టపర్తి కొండ, దొమ్మేటి వెంకటేశ్వరరావు, సూదాబత్తుల శ్రీను, నిట్టాల విజయసాయి పాల్గొన్నారు.
నేడు ప్రజా సమస్యల
పరిష్కార వేదిక
అమలాపురం రూరల్: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించి సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. 1100 కాల్ సెంటర్ ద్వారా తమ ఫిర్యాదుల పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చని, అలాగే కొత్త ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ప్రజల సౌకర్యార్థం మూడు రెవెన్యూ డివిజన్లు, 22 మండల కేంద్రాలు, 4 మున్సిపల్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీదారులు తమ సమస్యలను తెలపవచ్చన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలకు
ఇండక్షన్ స్టౌలు
రాయవరం: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పుడు గ్యాస్ స్టౌల స్థానంలో ఇండక్షన్ స్టౌలు అందజేసేందుకు సీ్త్ర శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో 1,726 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో ఆరు నెలల లోపు చిన్నారుల నుంచి ఆరేళ్ల లోపు వయసున్న చిన్నారులు 16 వేల వరకూ ఉన్నారు. చిన్నారులకు ఆట పాటలతో కూడిన విద్యతో పాటు, నాణ్యమైన పౌష్టికాహారం అందించాల్సి ఉంది. చిన్నారులకు ఆహార పదార్థాలను వండి వడ్డించేందుకు వంటలకు ఉపయోగించే గ్యాస్ ఆధారిత పొయ్యిల స్థానంలో విద్యుత్తు సాయంతో నడిచే ఇండక్షన్ స్టౌలు అందజేసే దిశగా చర్యలు చేపట్టారు. సిలిండర్ల బిల్లులు నెలల తరబడి పెండింగ్ ఉండటంతో సిబ్బంది సకాలంలో గ్యాస్ సరఫరా చేయడం లేదు. ఫలితంగా అంగన్‌వాడీ కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 277 ఇండక్షన్ స్టౌలు సరఫరా చేశారు. చిన్నారులకు సులభంగా ఆహారం తయారు చేసేందుకు వీలుగా విద్యుత్ సాయంతో పనిచేసే స్టౌలతో పాటు నాలుగు రకాల కుక్కర్లు, ఇతర పరికరాలను అందజేస్తున్నారు. మూడు ప్రాజెక్టుల పరిధిలోని కేంద్రాలకు వీటిని ఇచ్చారు. త్వరలోనే మిగిలిన వాటికి అందజేయనున్నారు. ఇప్పటి వరకూ ఏజెన్సీల నుంచి గానీ, ప్రైవేట్ వ్యక్తులు గానీ కేంద్రాలకు సిలిండర్లను సరఫరా చేసేవారు. వారికి ప్రభుత్వం నేరుగా నగదు జమచేసేది. ఇప్పుడు ఇండక్షన్ స్టౌలతో బిల్లుల ఇబ్బంది తప్పనుంది.
లోవలో భక్తుల సందడి
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేస్థానంలో సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి ఆదివారం ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు దేవదాయ శాఖ ఉప కమిషనర్, ఆలయ ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,05,890, పూజా టికెట్లకు రూ.1,71,160, కేశఖండన శాలకు రూ.18,760, వాహన పూజలకు రూ.9,240, పొంగలి షెడ్లు, కాటేజీలు, వసతి గదుల అద్దెలు రూ.77,426, విరాళాలు రూ.58,967, కలిపి మొత్తం రూ.5,41,443 ఆదాయం సమకూరింది.

రైతులు ఐక్యంగా సాగితే విజయం