
16 నుంచి విజయదుర్గా పీఠం 53వ వార్షికోత్సవాలు
రాయవరం: వెదురుపాక విజయదుర్గా పీఠం 53వ వార్షికోత్సవాలను ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, పీఆర్‌ఓ వి.వేణుగోపాల్ (బాబీ) తెలిపారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) సమక్షంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు వార్షికోత్సవ వివరాలు వెల్లడించారు. పీఠాధిపతి గాడ్ 1972 ఆగస్టు 18న మంత్రోపదేశం పొందారన్నారు. 1989 ఆగస్టు 16న శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్థస్వామి విజయదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ చేసి, భవానీ శంకర స్ఫటిక బాణాన్ని విజయదుర్గాదేవి సన్నిధిలో ప్రతిష్ఠించారన్నారు. పీఠంలో నిరంతరాయంగా విజయదుర్గా అమ్మవారికి పూజాదికాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. వచ్చే నెల 16న పీఠంలో సర్వతోభద్రతా మండప ఆవాహన జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
సీతారామ కల్యాణం
ఈ నెల 16న ఉదయం 8.45 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో వార్షికోత్సవాలు ప్రారంభమవుతాయని బాపిరాజు, బాబీ తెలిపారు. అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం భద్రాచలం వేద పండితులతో సీతారామచంద్రుల కల్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 6.15 గంటలకు శ్రీ సాయి సత్సంగ నిలయం, పీఠం మహిళా భక్తులతో శక్తిమాల సహిత మణిద్వీప వర్ణన శ్లోకాల పారాయణ, నవదుర్గల సువాసినీ పూజ నిర్వహిస్తారు. 17న జొన్నవాడ వద్ద ఉన్న శ్రీ కామాక్షితాయి అమ్మవారి ప్రధానార్చకులతో మహానవావరణ హోమం, సాయంత్రం 6 గంటలకు అన్నవరం దేవస్థానం పండితులతో అనంత లక్ష్మీ సత్యవతీదేవి సమేత వీర వేంకట సత్యనారాయణస్వామి వారి దివ్య కల్యాణం నిర్వహిస్తారన్నారు. 18వ తేదీ ఉదయం టీటీడీ వారితో విజయదుర్గా పీఠం వద్ద నెలకొల్పిన విజయ వెంకటేశ్వరస్వామి దివ్య కల్యాణం శ్రీ వైఖానస ఆగమ పండితులతో నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం ఆరు గంటలకు విజయదుర్గా అమ్మవారికి ప్రత్యేక అర్చన, హారతులు, చతుర్వేదస్వస్తి కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. వార్షికోత్సవాలకు వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. సమావేశంలో పీఠం భక్తజన కమిటీ సభ్యులు గాదె భాస్కర నారాయణ తదితరులు పాల్గొన్నారు.