బతుకు బాటలో కలిసి నడిచి.. కష్టంలోనూ ఒక్కటిగా 

Wife and Husband committed Suicide Over Debt Burden in Srikakulam - Sakshi

చిన్నమంగళాపురంలో విషాదఛాయలు 

సాక్షి, శ్రీకాకుళం(పాలకొండ రూరల్‌): రెక్కల కష్టం నమ్ముకొని జీవించే కుమ్మరి దంపతుల కుటుంబం అప్పులు ఊబిలో కూరుకుపోయింది. కరోనా కష్ట సమయంలో తాము నమ్ముకున్న ఇటుక బట్టీ నడవక పోవటంతో దొరికిన చోటల్లా అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. అయితే కోవిడ్‌ తగ్గుముఖం పట్టినా వారు చేసిన అప్పులు అలాగే ఉండిపోయాయి. ఇటుకల బట్టీ సక్రమంగా నడవకపోవటంతో అప్పు ఇచ్చినవారికి ముఖం చూపించలేని పరిస్థితి దాపురించింది. ఏమి చేయాలో పాలుపోక చావే శరణ్యమని భావించారు. గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడికట్టారు. బతుకు బాటలో కలిసి నడిచిన వారు కష్టంలోనూ ఒక్కటిగా తనువులు చాలించాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషాద ఘటనలో భర్త మరణించగా భార్య మృత్యువుతో పోరాడుతోంది. ఈ సంఘటన పాలకొండ మండలం చిన్నమంగళాపురం గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నాగవరపు రామారావు (47), తవిటమ్మ దంపతులు. వృత్తిరీత్యా కుమ్మరులు కావటంతో గ్రామ సమీపంలో ఇటుక బట్టీ నిర్వహిస్తున్నారు. కుమార్తెకు వివాహం చేయగా కుమారుడు గౌరితో కలసి ఉంటున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఇటుకల తయారీ పనులు నిలిచిపోవడంతో ఆర్థిక సమస్యలు వెంటాడాయి. ఇల్లు గడవడం భారంగా మారింది. దీంతో చేసేది లేక తెలిసిన వారివద్ద, దొరికినచోటల్లా అప్పులు చేసి కాలం నెట్టుకొచ్చారు. అయితే పనుల్లేక.. చేసిన అప్పులు తీర్చే దారిలేక లోలోన కుంగిపోయారు. చేసేది లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం అందరితో కలివిడిగా ఉన్న వీరు ఆ రాత్రి గడ్డి నివారణకు వాడే మందును ఇంట్లోనే తాగేసి అపస్మారక స్థితికి చేరుకున్నారు. రాత్రి ఒంటిగంట సమయంలో కుమారుడు గౌరి నీరు తాగేందుకు ఇంట్లోకి వెళ్లగా తల్లిదండ్రులు స్పృహతప్పి పడిపోయి ఉండటాన్ని గుర్తించాడు.

చదవండి: (విషాదం: బిడ్డ మరణాన్ని తట్టుకోలేక...)  

చుట్టపక్కల వారికి తెలియజేయటంతో వారు వచ్చి రామారావు, తవిటమ్మలను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే రామారావు మరణించగా తవిటమ్మ మృత్యువుతో పోరాడుతోంది. ఆమెను మెరుగైన వైద్యం కోసం వైద్యులు శ్రీకాకుళం రిఫర్‌ చేయగా ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న సీఐ జి.శంకరరావు, ఎస్సై సీహెచ్‌ ప్రసాద్‌లు మంగళవారం చిన్నమంగళాపురం వెళ్లి దర్యాప్తు చేపట్టారు. రామారావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కుమారుడు గౌరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తవిటమ్మ వద్ద వీడియో రూపంలో వాంగ్మూలం సేకరించగా అప్పులు బాధలే కారణమని ఆమె తెలిపినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అందరితో కలివిడిగా ఉండే దంపతులు తీసుకున్న నిర్ణయంతో చిన్నమంగళాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top