17 కేజీల బంగారం చోరి.. తల్లీ, కుమారుడి హత్య

Thieves Steal 17 kg Gold And Killed Jewellery Shop Owner Wife And Son - Sakshi

నగల వ్యాపారి ఇంట్లో 17 కేజీల బంగారం చోరీ 

అడ్డొచ్చిన తల్లీకుమారుడి హత్య 

పోలీసుల ఎదురు కాల్పుల్లో ఓ దుండగుడు హతం 

మిగిలిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

సాక్షి, చెన్నై: శీర్గాలిలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం ఓ నగల వ్యాపారి ఇంట్లోకి చొరబడి నలుగురిపై కత్తులతో దాడి చేశారు. ఇంట్లో ఉంచిన 17 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దాడిలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు ఓ దొంగను ఎన్‌కౌంటర్‌ చేయగా, మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మైలాడుతురై జిల్లా శీర్గాలి రైల్వేస్టేషన్‌ రోడ్డులో నగల వ్యాపారి ధనరాజ్‌ (50), ఆయన భార్య ఆశ(48), కుమారుడు అఖిల్‌(25), కోడలు నిఖిల(24) నివసిస్తున్నారు. బుధవారం వేకువజామున 6 గంటలకు దుండగులు ఆయన ఇంటి తలుపుతట్టారు. హిందీలో ఏదో అడుగుతున్నట్టుగా నటించి క్షణాల్లో ఆయనపై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఆశ, అఖిల్, నిఖిలపై దాడి చేశారు. ఇనుప రాడ్డుతో విచక్షణా రహితంగా కొట్టి కత్తులతో పొడిచారు. అనంతరం బీరువాలో ఉంచిన 17 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇంట్లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి బయట పార్క్‌ చేసిన ధనరాజ్‌ కారులో ఉడాయించారు.  

తక్షణం స్పందించిన పోలీసులు 
దనరాజ్‌ కేకలతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆశ, అఖిల్‌ మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ధనరాజ్, నిఖిలను ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ శ్రీనాథ్, డీఎస్పీ యువప్రియ, ఇన్‌స్పెక్టర్‌ మణియన్, ఎస్‌ఐ మణిగండ గణేషన్‌ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. ధనరాజ్‌ కారులో ఉన్న జీపీఎస్‌ ఆధారంగా వారిని వెంబడించారు. ఎలుగురులో కారును వదలిపెట్టిన దుండగులు, అక్కడి నుంచి పంట పొలాల మీదుగా వెళ్లారు. కరుప్పన్నతోట్టంలో భుజాన ఓ సంచి వేసుకుని అనుమానాస్పదంగా ఉత్తరాది యువకులు తిరుగుతున్నట్టు పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. అక్కడున్న ముగ్గురు యువకుల్లో ఒకరు పోలీసులను చూడగానే తనవద్దనున్న తుపాకీతో ఫైరింగ్‌ చేయడం మొదలెట్టాడు. దీంతో ఆత్మ రక్షణకు పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఒకరు హతమయ్యాడు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుండగుల కాల్పుల్లో స్పెషల్‌ టీం పోలీసులు ఇద్దరు గాయపడ్డారు.  

అన్ని తెలిసిన వాడే... 
పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మణిపాల్‌ సింగ్‌ (24) హతమయ్యాడు. ఉత్తరాదికి చెందిన  ఇతను గతంలో ధనరాజ్‌ వద్ద పనిచేశాడు. ధనరాజ్‌ వ్యాపారం గురించి పూర్తిగా తెలిసిన వాడు.  ఇటీవల ఓ తప్పు చేసి అడ్డంగా బుక్కవడంతో పని నుంచి తొలగించారు. దీంతో తంజావూరులోని ఓ దుకాణంలో పనిచేస్తున్న  ఉత్తరాదికి చెందిన మిత్రులు మనీష్‌(22), రమేష్‌(22)తో కలిసి దోపిడీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. 

లలితాలో 5 కేజీల బంగారం అపహరణ 
చెన్నై హబీబుల్లా రోడ్డులో లలిత జ్యువెలర్స్‌ ఉంది. ఇక్కడ ఆభరణాల లెక్కింపు సమయంలో 5 కేజీల బంగారం మాయమైంది. ఇక్కడ పని చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌ సింగ్‌ చేతివాటం ప్రదర్శించి ఉండడం సీసీ కెమెరాలో నమోదైంది. తేనాంపేట పోలీసులు విచారణ చేపట్టారు. బంగారంతో ప్రవీణ్‌కుమార్‌ రాజస్థాన్‌కు ఉడాయించడంతో అతడి కోసం ప్రత్యేక బృందం బుధవారం అక్కడికి వెళ్లింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top