
కర్నూలు జిల్లా: కాంగ్రెస్ నేత లక్ష్మీ నారాయణ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత లక్ష్మీ నారాయణ హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.
గుమ్మనూరు నారాయణను ఆలూరు పీఎస్‌కు తరలించారు. ఈరోజు గుమ్మనూరు నారాయణను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేత లక్ష్మీ నారాయణ హత్య కేసులో గుమ్మనూరు నారాయణ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే గుమ్మనూరు నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
కాగా, గత నెలలో గుంతకల్లులో కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణహత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న లక్ష్మీ నారాయణను కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు.
కాంగ్రెస్ లక్ష్మీనారాయణ కారును టిప్పర్ తో ఢీకొట్టారు దుండగులు. ఆపై లక్ష్మీ నారాయణపై వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో లక్ష్మీ నారాయణ కుమారుడు వినోద్‌కు సైతం గాయాలయ్యాయి.