రుణం కోసం కుమారుడి తాకట్టు 

Tamil Nadu Couple Hostage Son On Money Lenders - Sakshi

టీ.నగర్‌: తీసుకున్న రుణం కోసం కుమారుడిని తండ్రి తాకట్టు పెట్టినట్లు భార్య ఫిర్యాదు చేసింది. రామనాథపురం జిల్లా, పరమకుడి జ్యువెలరీ బజారు వీధికి చెందిన దంపతులు రమేష్, శరణ్య. వీరికి 13 ఏళ్ల కుమారుడు, 11 ఏళ్ల కుమార్తె ఉన్నారు. వివాహ సమయంలో శరణ్యకు 90 సవర్ల బంగారు నగలను వరకట్నంగా ఇచ్చారు. రమేష్‌ తండ్రితోపాటు నగల దుకాణం నడుపుతున్నాడు. వ్యాపారంలో రెండేళ్లుగా నష్టం రావడంతో శరణ్య నగలు విక్రయించినట్లు సమాచారం. బయట రుణాలు తీసుకుని వ్యాపారం సాగించారు.

నగదు తిరిగి ఇవ్వకపోవడంతో రుణదాతలు రమేష్‌ను వేధించడం మొదలుపెట్టారు. రుణాల బాధతో శరణ్య గత డిసెంబరులో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలో కుమారుడ్ని రుణదాతలకు అప్పగించి, నగదు చెల్లించగానే అతన్ని ఇంటికి తీసుకురావడం పరిపాటిగా మారినట్లు భార్య శరణ్య ఆరోపించారు. ఇలావుండగా, రమేష్‌ ఇంట్లో నుంచి శరణ్యను గెంటివేశాడు. దీంతో ఆమె తన కుమారుడు, సోదరుడితో కలిసి పరమకుడి ముత్తాలమ్మన్‌ ఆలయ ప్రాంగణంలో ఆందోళన జరిపింది.  భర్త రమేష్‌పైన, రుణాలిచ్చిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top