రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి..

Relatives Are Harassing The Woman In Guntur District - Sakshi

వివాహితను నగ్నంగా వీడియో తీసి వేధింపులు

వీడియో బయటపెట్టకుండా  ఉండేందుకు డబ్బులు డిమాండ్‌

వేధింపులు తాళలేక ఆత్మహత్యచేసుకున్న బాధితురాలు 

ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోతీసిన వైనం

పొన్నూరు(గుంటూరు జిల్లా): ఓ వివాహిత స్నానం చేస్తుండగా కొంత మంది బంధువులు వీడియో తీశారు. ఆ వీడియో బయటపెట్టకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్‌ మెయిల్‌ చేశారు. రూ.లక్షల్లో ఇచ్చినా ఇంకా కావాలంటూ డిమాండ్‌ చేశారు. చనిపోవాలంటూ ప్రేరేపించారు. ఈ వేధింపులు తాళలేక ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోతీసి అందులో వేధింపుల వైనాన్ని వివరించింది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం మేరకు.. పొన్నూరు 17వ వార్డులో నివసించే బలిమిడి లక్ష్మీతిరుపతమ్మ (32) ఈ నెల ఒకటో తేదీన ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది.

పనికి వెళ్లిన భర్త శ్రీనివాసరావు ఇంటికి వచ్చినా భార్య ఎంతసేపటికీ ఇంటి తలుపులు తీయకపోవడంతో అతను అత్తమామలు, బంధువులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి తలుపులు పగలగొట్టి ఆమెను బయటికి తీసుకొచ్చి పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స చేశాక స్పృహలోకి వచ్చిన ఆమె తన ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులకు తెలిపింది. అన్ని వివరాలతో ఫోన్‌లో వీడియో తీసి ఉంచానని, చూడాలని చెప్పింది. ఫోన్‌లో వీడియో చూడగా.. లక్ష్మీతిరుపతమ్మ స్నానం చేస్తుండగా బంధువులు కొందరు నగ్నంగా వీడియో తీసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని ఉంది. వారికి రూ.లక్షల్లో ఇచ్చానని, ఇంకా కావాలని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని, చనిపోవాలని ప్రేరేపిస్తున్నారని, అడిగినంత డబ్బు తమకు ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి లక్ష్మీతిరుపతమ్మ ఆదివారం మృతిచెందింది. తన భార్య మృతికి కారణమైన అన్నావారి శ్రీనివాసరావు, కొంకిపూడి సురేష్, నాగలక్ష్మి, సూర్యారెడ్డి, హరీష్‌, కొంకిపూడి లక్ష్మీ తిరుపతమ్మపై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని పోలీసులకు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ శరత్‌బాబు చెప్పారు. నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించేందుకు సోమవారం వచ్చిన కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ను లక్ష్మీ తిరుపతమ్మ భర్త, బంధువులు కలసి న్యాయం చేయాలని కోరారు.

చదవండి: అనుమానం; ఎలాగైన భార్యను చంపేయాలని పక్కా ప్లాన్‌తో!
కోవిడ్‌ సెంటర్లలో రెచ్చిపోతున్న కామాంధులు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top