పంజాబ్‌కు ‘కార్వీ’ పార్థసారథి

Punjab Police Get Custody Of Karvy CMD - Sakshi

రూ.25 లక్షల మోసంపై అక్కడ కేసు 

పీటీ వారెంట్‌ ఆమోదించిన న్యాయస్థానం 

ముంబై బాధితుడి ఫిర్యాదుతో మరో కేసు  

సాక్షి, హైదరాబాద్‌: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేఎస్‌బీఎల్‌) చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.పార్థసారథిని పంజాబ్‌ పోలీసులు ఆ రాష్ట్రానికి తరలించారు. అక్కడి బర్నాలా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో విచారించనున్నారు. బర్నాలాకు చెందిన ఓ వ్యక్తిని రూ.25 లక్షల మేర మోసం చేసినట్లు గతేడాది కేసు నమోదైంది. అయితే అక్కడి పోలీసులు ఇప్పటిదాకా ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు. గత నెల్లో హైదరాబాద్‌లో నమోదైన కేసుకు సంబంధించి పార్థసారథిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ఆయా కేసుల్లో ఇతడి కస్టడీ, విచారణలు సైతం పూర్తి చేశారు. దీనిపై సమాచారం అందుకున్న బర్నాలా అధికారులు తమ వద్ద ఉన్న కేసుకు సంబంధించి పార్థసారథిని తీసుకురావడానికి ప్రిజనర్‌ ట్రాన్సిట్‌ వారెంట్‌ జారీ చేయాలని అక్కడి కోర్టును కోరారు. ఇది జారీ కావడంతో బర్నాలా ఠాణాకు చెందిన ఏఎస్సై కమల్‌జీత్‌ సింగ్‌ నగరానికి చేరుకున్నారు. మంగళవారం నాంపల్లి కోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేసి నిందితుడి తరలింపునకు అనుమతి కోరారు.

దీన్ని పరిశీలించిన న్యాయస్థానం పార్థసారథిని పంజాబ్‌ పోలీసులకు అప్పగించాల్సిందిగా చంచల్‌గూడ జైలు అధికారులను ఆదేశించింది. దీని ఆధారంగా ఆయనను పంజాబ్‌ పోలీసులు బర్నాలాకు తరలిస్తున్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులను భవిష్యత్తులో అక్కడకు తీసుకెళ్లనున్నారు. మరోవైపు, కార్వీపై ముంబైకి చెందిన మరో బాధితుడు లలిత్‌ బండారీ ఇటీవల హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. లలిత్‌ బండారీకి డీమ్యాట్‌ ఖాతా ఓపెన్‌ చేస్తామని, ట్రేడింగ్‌ కూడా చేస్తామమంటూ రూ.1.13 కోట్లు తీసుకుని కార్వీ మోసం చేసింది. ఆ డబ్బునూ ఇతర సంస్థల్లోకి మళ్లించేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దాన్ని అక్కడకు బదిలీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top