లాక్‌ డౌన్‌ ఆసరా చేసుకుని దారి దోపిడీలు | Police Arrested Highway Robbery Gang In Bhupalpally district | Sakshi
Sakshi News home page

లాక్‌ డౌన్‌ ఆసరా చేసుకుని దారి దోపిడీలు

Jun 18 2021 10:40 AM | Updated on Jun 18 2021 11:08 AM

Police Arrested  Highway Robbery Gang In Bhupalpally district - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, పరకాల(జయశంకర్‌ భూపాలపల్లి) : దారి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పరకాల ఏసీపీ పి.శ్రీనివాస్‌ తెలిపారు. పరకాల ఏసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల అరెస్టుతో పాటు స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులను ప్రదర్శించారు. ఏసీపీ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ దేశాయిపేటకు చెందిన తనుగుల రాజు, పైడిపల్లికి చెందిన జన్ను అజయ్‌ ఇద్దరు జల్సాలకు అలవాటు పడి కొంతకాలంగా దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. వరుసకు బావబావమరుదులైన వీరిద్దరూ లాక్‌డౌన్‌ సమయాన్ని ఆసరాగా చేసుకుని రాత్రి వేళలో ఒంటరిగా వెళ్లే వారిపై నిర్మానుష్య ప్రాంతాల్లో దాడి చేసి సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లేవారు.

ఈ నెల 14వ తేదీ రాత్రి 10 గంటల ప్రాంతంలో ఏదైనా వాహనం కోసం దామెర క్రాస్‌ వద్ద ఒంటరిగా ఎదురుచూస్తున్న గణేష్‌ అనే వ్యక్తికి స్కూటిపై వచ్చి లిఫ్ట్‌ ఇచ్చినట్లే ఇచ్చి పవర్‌ గ్రిడ్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేసి సెల్‌ఫోన్‌ ఎత్తుకెళ్లారు. అదే రోజు రాత్రి టాటా ఏస్‌ డ్రైవర్‌ కోడెపాక కుమారస్వామిపై దాడి చేసి సెల్‌ఫోన్‌తో పాటు వాహనంలోని 6 రాగి మాల్ట్‌ బస్తాలను అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో దామెర పోలీసులు ఊరుగొండ శివారులోని కేఎస్‌ఆర్‌ స్కూల్‌ వద్ద గురువారం నిఘా పెట్టి అనుమానంగా కనిపించిన వీరిద్దరిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా పారిపోయేందుకు యత్నించడంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులుగా తేలడంతో కేసు నమోదు చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు నిందితుల నుంచి రూ.24వేల విలువ చేసే సెల్‌ఫోన్లు, రాగి పిండి బస్తాలు, బ్యాటరీ, దోపిడీకి ఉపయోగించిన హోండా యాక్టివాను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.  ఫిర్యాదు రాగానే స్పందించి 48 గంటల్లో అరెస్టు చేసినందుకు పరకాల రూరల్‌ సీఐ రమేష్‌కుమార్, ఎస్సై భాస్కర్‌రెడ్డిని అభినందించారు. 

చదవండి: 50 సార్లు అరెస్ట్‌ అయ్యింది.. అయినా కూడా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement