
ప్రతీకాత్మక చిత్రం
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. గత కొన్ని రోజులుగా స్టేషన్ పరిధిలో పలువురు రౌడీషీటర్లు చేస్తున్న దాడులు, అల్లర్లపై ‘సాక్షి’లో సోమవారం ‘వామ్మో సింగ్‌నగర్’ అనే కథనంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. స్టేషన్ పరిధిలో ఏమి జరుగుతుందనే అంశాలపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. అనుమానిత రౌడీషీటర్లపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకూ పోలీసులు పలువురు రౌడీషీటర్ల ఇళ్లను తనిఖీ చేశారు.
సింగ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో అనుమానంగా తిరుగుతున్న తేజాశంకర్ అలియాస్ పిల్ల సాధు, ఆర్యప్రకాష్, గుమ్మడి సంజయ్, అభి అనే నలుగురు రౌడీషీటర్ల వద్ద సుమారు నాలుగున్నర కిలోల గంజాయి లభ్యమైంది. వీరిలో అభి అనే రౌడీషీటర్ పరారీలో ఉండగా మిగిలిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రౌడీషీటర్లతో పాటు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ సభ్యులపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాలపై జల్లెడ పడుతున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.