పెళ్లి చేసే స్థోమత లేక అమ్మకానికి అమ్మాయి! 

Minor Girl Sale To Rajasthan Man In Mahabubnagar - Sakshi

పెళ్లి చేసే స్థోమత లేక రాజస్తాన్‌ వాసికి అమ్మకం

రూ.3 లక్షల బేరం.. అడ్డుకుని అమ్మాయిని స్టేట్‌హోంకు తరలించిన పోలీసులు

మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలంలో ఘటన

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఆ పేద దంపతులకు కన్నకూతురే భారమైంది. పెళ్లి చేయలేమనే నిస్సహాయత ఆ అమ్మాయిని అమ్మకానికి పెట్టింది. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం వెలుగు చూసింది. నవాబ్‌పేట మండలం హాజిలాపూర్‌ గ్రామ పరిధిలోని  గాలోనికుంటకు చెందిన వాలమ్మ, రవినాయక్‌ దంపతులు. వీరికి నలుగురు సంతానం. హైదరాబాద్‌లో కూలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అక్కడే వీరికి షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తితో పరిచయమైంది. రెండో కూతురు(17)కు పెళ్లి చేయాలనే ఆందోళన ఆ దంపతుల్లో మొదలైంది. వీరి నిస్సహాయతను గుర్తించిన షాద్‌నగర్‌కు చెందిన సదరు వ్యక్తి ఆమెను అమ్మేందుకు స్కెచ్‌ వేశాడు.

రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తితో పెళ్లి చేద్దామంటూ ఆ దంపతులను ఒప్పించాడు. ఇందుకు సదరు పెళ్లికొడుకు ద్వారా రూ.3 లక్షలు ఇప్పిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతడికి అప్పగిం చేందుకు ఆ దంపతులు శుక్రవారం ఉదయం నవాబ్‌పేట నుంచి అమ్మాయిని తీసుకుని హైదరా బాద్‌కు బయల్దేరారు. అంతలోనే దుబాయ్‌లో ఉంటున్న ఆమె బాబాయ్‌కి విషయం తెలియడంతో నవాబ్‌పేట పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ దంపతులను అడ్డుకున్నారు. అమ్మాయి మైనర్‌ కావడంతో తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఆమెను మహబూబ్‌నగర్‌లోని స్టేట్‌హోంకు తరలించారు.

దుబాయ్‌ నుంచి సమాచారం: ఎస్‌ఐ శ్రీకాంత్‌
రాజస్తాన్‌కు బాలికను పంపుతున్నారని దుబాయి నుంచి బాలిక బంధువు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగి ఆ తల్లిదండ్రులను అడ్డుకున్నాం. బాలికల తరలింపు ఘటనలో ఎవరైనా మధ్యవర్తులు మండలంలో ఉన్నారా.. డబ్బుల కోసం ఎర వేస్తున్నారా అనే విషయాలపై విచారణ చేస్తు న్నాం. బాలికల విక్రయాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటాం. అమ్మాయిల తరలింపునకు బాధ్యులైనవారిని వదిలిపెట్టం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top