డబ్బు ఇ‍వ్వలేనంది.. ఫోన్‌ రికార్డు భర్తకు ఇవ్వడంతో

Married Women Deceased By Friend Blackmail For Money Over Phone Records - Sakshi

కావలి: బంధువు వేధింపులు, భర్త, అత్త కుటుంబ సభ్యుల హింసలు తట్టుకోలేక ఓ వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో నిందితులను జలదంకి పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు కావలి డీఎస్పీ డి.ప్రసాద్‌ వివరాలు వెల్లడించారు. జలదంకి మండలం కొత్తపాళెం గ్రామానికి చెందిన కోట మహితకు ప్రసాద్‌రెడ్డితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు.

గ్రామంలో న్యూడిల్స్‌ అమ్మకా లు చేసే వ్యక్తి తన పాటు చిన్నప్పటి నుంచి చదువుకున్న స్నేహితుడు కావడంతో అప్పుడప్పుడు మహిత తన బంధువైన కోట వెంకటరెడ్డి సెల్‌ ఫోన్‌తో మాట్లాడుతుండేది. అయితే వీరి మధ్య ఎటువంటి అసభ్యకరమైన, అభ్యంతరకరమైన మాటలు లేవు. అయితే వారి మాటలను కోట వెంకటరెడ్డి తన ఫోన్‌లో రికార్డ్‌ చేస్తుండేవాడు. ఈ విషయం మహితకు తెలియదు.

కొద్ది రోజులకు కోట వెంకటరెడ్డి న్యూడిల్స్‌ అమ్మకాలు చేసే వ్యక్తితో మాట్లాడుతున్న విషయం భర్త, అత్త మామలకు చెబుతానని, అలా చెప్పకూడదంటే తనకు డబ్బులు ఇవ్వాలని బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలు పెట్టారు. మహిత భయపడి కోట వెంకటరెడ్డికి పలుమార్లు డబ్బులు ఇస్తుండేది. అయితే వెంకటరెడ్డి వేల రూపాయలు ఇవ్వాలని ఆమెను బెదిరిస్తున్నాడు. అంత డబ్బులు ఇచ్చే స్థోమత లేని మహిత తాను ఇవ్వలేనని చెప్పేసింది.

దీంతో కోట వెంకటరెడ్డి తన ఫోన్‌లో ఉన్న మహిత, న్యూడిల్స్‌ అమ్మకాలు చేసే వ్యక్తి కాల్స్‌కు సంబంధించిన వాయిస్‌ రికార్డులను ఆమె భర్తకు అందజేశాడు. దీంతో ఆమెను భర్త ప్రసాద్‌రెడ్డి, అత్త పద్మ, భర్త అమ్మమ్మ రావమ్మ శారీరకంగా, మానసికంగా హింసించసాగారు.  తట్టుకోలేక మహిత ఈ నెల 13న ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు జలదంకి పోలీసులు కేసు నమోదు చేశారు. కావలి రూరల్‌ సీఐ పి.అక్కేశ్వరరావు, జలదంకి ఎస్సై ఎం.వెంకట్రావు, సిబ్బంది దర్యా ప్తు చేసి కోట వెంకటరెడ్డి ఫోన్‌లోని డేటాను శాస్త్రీయంగా సేకరించి కేసును దర్యాప్తు ప్రారంభించారు.

తొలుత ఆత్మహత కేసుగా నమోదు కాగా, దర్యాప్తు అనంతరం మృతురాలి భర్త ప్రసాద్‌రెడ్డి, మిగిలిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భర్తతో పాటు సెల్‌ఫోన్‌లో వాయిస్‌ రికార్డు చేసి బ్లాక్‌ మెయిల్‌ చేసిన కోట వెంకటరెడ్డిను శనివారం అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. మిగిలిన ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేస్తామని  వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ అక్కేశ్వరరావు, ఎస్సై వెంకట్రావు పాల్గొన్నారు.

చదవండి: పోలీస్‌స్టేషన్‌లో నగదు మాయం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top