ఇన్‌ఫార్మర్‌ నెపంతో హత్య 

Maoists Assassinated Village Guard In Odisha At Rayagada District - Sakshi

రాయగడ: పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ నెపంతో గ్రామ రక్షకుని మావోయిస్టులు హత్య చేసిన ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లాలో మనిగుడ సమితి టికరపడ గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడు సంతోష్‌ దండసేన(27)గా పోలీసులు గుర్తించారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపన వివరాల ప్రకారం... సాయుధలైన మావోయిస్టులు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో దండసేన ఇంటికి వెళ్లి, అతనిని బయటకు తీసుకు వెళ్లారు. ఊరికి కొంతదూరంలో అతనిని హత్య చేసి, మృతదేహం వద్ద ఒక పోస్టర్‌ను విడిచిపెట్టి వెళ్లారు. గ్రామ రక్షకుడిగా విధులు నిర్వహిస్తున్న దండసేన గత కొన్నాళ్లుగా పోలీసులకు తమ సమాచారాన్ని చేరవేస్తున్నాడని అందులో పేర్కొన్నారు.

చదవండి: మహాప్రభో అని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోలే.. చివరికి

గ్రామానికి చెందిన మరికొంత మంది యువకులను కూడా పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరించాలని ప్రలోభ పెట్టినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై పలుమార్లు హెచ్చరించినప్పటికీ మారకపోవడంతో హత్య చేయాల్సి వచ్చిందని వంశధార–గుముసుర–నాగావళి డివిజన్‌ కమిటీ పోస్టర్‌లో వివరించింది. ఎవరైనా ఈ తరహా వ్యవహారాలకు పాల్పడితే ఇదే దుస్థితి తప్పదని హెచ్చరించారు. బుధవారం ఉదయం విషయం తెలుసుకున్న మునిగుడ పోలీసులు.. టికరపొడ గ్రామానికి సమీపంలో మృతదేహాన్ని కనుగొన్నారు. పోస్టర్‌ను స్వాధీనం చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: రోడ్డు లేని ఊరు.. దారేది బాబు..!

     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top