భార్యను చితకబాది, మామ పక్కటెముకలు విరగ్గొట్టిన భర్త

Man Thrashes Wife For Gold As Dowry,, Breaks Ribs Of Father In Law - Sakshi

తిరువనంతపుంర: ఓ వైపు కేరళ ప్రభుత్వం వరకట్న నిషేధంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తుంటే మరోవైపు గృహహింస వేధింపులు ఎక్కువయ్యాయి. తాజాగా 31 ఏళ్ల మహిళను కట్నం కోసం భర్త వేధింపులకు గురిచేయడంతోపాటు ఆమె తండ్రిని చితకబాది అతని పక్కటెముకలను విరగొట్టిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొచ్చికి చెందిన మహిళను ఏప్రిల్‌ 12న ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వీరిద్దరికి ఇది రెండో వివాహం. కానీ పెళ్లైనప్పటి నుంచి మహిళను భర్త వేధించడం మొదలు పెట్టాడు. అదనపు కట్నం కావాలని. బంగారం కావాలని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ క్రమంలో మహిళ బంగారాన్ని భర్త తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నాడని తెలిసి ఆమె తల్లిదండ్రులు ఆ బంగారాన్ని బ్యాంక్‌ లాకర్‌కు మార్చారు. ఈ విషయం కాస్తా భర్తకు తెలియడంతో తన తల్లితో కలిసి భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు.

అంతేగాక భార్యకు అన్నం కూడా పెట్టకుండా బాధపెట్టారు. అక్కడితే ఆగకుండా భార్య బంగారంలో తన వాట తనకు ఇవ్వకపోతే కొల్లాంలో వరకట్న వేధింపులతో బలైన విస్మయ లాగే తను కూడా అదే పరిస్థితిని ఎదుర్కొవాల్సి వస్తుందని భర్త బెదిరించాడు. ఈ క్రమంలో జూలై 9 న తిండి కూడా పెట్టకుండా ఆమెను ఇంటి నుండి బయటకు గెంటేశారు. దీంతో వివాహిత సరాసరీ తన తండ్రి ఇంటికి వెళ్ళడంతో ఈ విషయంపై చర్చించడానికి జూలై 17న మహిళ తండ్రి కూతురు అత్తగారింటికి వచ్చారు. అయితే ఇదే అదునుగా భావించిన అల్లుడు భార్యపై ఇష్టారీతిగా చేయిచేసుకున్నాడు. మధ్యలో అడ్డు వచ్చిన మామని చితకబాది పక్కటెముకలు విరగొట్టాడు. చివరికి బాధిత కుటుంబం జూలై 23 న పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ సెక్షన్లు 498 ఎ, 323, 506, 34తో పాటు వరకట్నం నిషేధ చట్టంలోని సెక్షన్ 3, 4 కింద భర్త, అతని తల్లిదండ్రులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

కాగా కేరళ ప్రభుత్వం వరకట్నానికి వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న పెళ్లి అవ్వని పురుష ఉద్యోగులు వరకట్నం తీసుకోవడం లేదా ప్రోత్సహించడం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు పెళ్లయిన నెలరోజుల్లో సంబంధిత విభాగాల అధిపతులకు డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్‌లో భార్య సంతకంతో పాటు వధువు తండ్రి, వరుడి తండ్రి సంతకాలు ఉండాలని తెలిపింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే సర్క్యలర్ జారీ చేసింది. అయితే తప్పుడు సమాచారాన్ని అందిస్తే చట్టపరమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top