ప్రేమ వేధింపులు: అల్లుడిని హత్య చేసిన మామ 

Man Assassinated By His Uncle At Chandrayangutta Over Love Harassment - Sakshi

చాంద్రాయణగుట్ట: ప్రేమ పేరుతో కూతురును తప్పుదోవ పట్టించడమే కాకుండా....వేధింపులకు గురి చేయడాన్ని భరించలేని ఓ తండ్రి అల్లుడి గొంతు కోసి హత్య చేసిన సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం...ఫలక్‌నుమా అన్సారీ రోడ్డుకు చెందిన అబ్దుల్‌ షారూక్‌ (24) మైలార్‌దేవ్‌పల్లికి చెందిన అన్వర్‌ కుమార్తెను 2020 మే నెలలో ప్రేమ పేరుతో వేధించడంతో నిర్భయ చట్టం కింద కేసు నమోదయ్యింది.

అప్పట్లో జైలుకెళ్లిన షారూక్‌ ఇటీవలే విడుదలయ్యాడు. తాజాగా రెండు నెలల క్రితం సదరు బాలికను తల్లిదండ్రులకు సమాచారం లేకుండా నిఖా చేసుకున్నాడు. ఇటీవలే అత్తగారింటికి ఫోన్‌ చేస్తూ....తన భార్యను పంపించాలంటూ షారూఖ్‌ తరచుగా ఫోన్‌ చేయసాగాడు. షారూఖ్‌కు గతంలోనే పెళ్లి జరగడంతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్న విషయం తెలుసుకున్న అన్వర్‌ అల్లుడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

ఇందులో భాగంగానే ఆదివారం ఉదయం షారూక్‌కు ఫోన్‌ చేసి శాలిబండ వరకు వెళ్దామని పిలిపించాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో యాక్టివాపై అల్లుడు ద్విచక్ర వాహనం నడుపుతుండగా.....వెనుక కూర్చున్న మామ ఫలక్‌నుమా డిపో ఎదురుగా రాగానే తన వద్ద ఉన్న చాకుతో షారూఖ్‌ గొంతు కోయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

చదవండి: 3 రోజులు.. 3 ఎయిర్‌పోర్టులు..285కోట్లు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top